పేరుతో... పేరొచ్చింది!
63 పదాలతో స్వీడన్ వాసి రికార్డు
లండన్: పేరుతోనే ఓ స్వీడన్ యువకుడు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి 63 పదాలతో చాంతాడంట పొడవైన పేరుంటే సాధ్యం కానిదేముంది? స్వీడన్‌కు చెందిన పాపా లాంగ్ నమేష్(25) పూర్తి పేరు చదవాలంటే కాస్త ఓపిక కావాలి...
‘‘కిమ్-జోంగ్ సెక్సీ గ్లోరియస్ బీస్ట్ డివైన్ డిక్ ఫాదర్ లవ్లీ ఐరన్ మ్యాన్ ఈవెన్ యూనిక్ పో అన్ విన్ చార్లీ ఘోరా ఖావోస్ మెహన్ హన్స కిమ్మీ హంబెరో ఉనో మాస్టర్ ఓవర్ డాన్స్ షేక్ బౌటి బీపాప్ రాక్‌స్టెడీ ష్రెడ్డర్ కుంగ్ ఉల్ఫ్ రోడ్ హౌస్ గిల్‌గమేష్ ఫ్లాప్ గై థియో ఏ హ ఇమ్ యోడా ఫంకీ బాయ్ స్లామ్ డక్ ఛుక్ జోర్మా జుక్కా పెక్కా ర్యాన్ సూపర్ ఎయిర్ ఊయ్ రస్సెల్ సాల్వెడార్ అల్ఫాన్స్ మోల్గాన్ ఆక్టా పాపా లాంగ్ నమేష్ ఏక్’’
అలెగ్జాండర్ ఏక్... ఒసామా బిన్ ఏక్
పాపా లాంగ్ నమేష్‌కు పేర్లు మార్చుకోవటం ఓ సరదా. గతంలో అలెగ్జాండర్ ఏక్, ఒసామా బిన్ ఏక్ అనే పేర్లుండేవి. స్టాక్‌హోమ్ దగ్గర్లోని హనిన్‌గెలో ఉంటాడు. 18 ఏళ్ల వయసు నుంచే పేర్లు మార్చుకోవటం మొదలైంది. ఇప్పటికి ఆరుసార్లు పేరు మార్చుకున్నాడు. రకరకాల పేర్లతో ఇంటికి ఉత్తరాలు వస్తుండటంతో అతడి తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యేవారు. అన్నట్లు స్వీడన్‌లో ఎవరైనా ఒక్కసారి మాత్రమే ఉచితంగా పేరు మార్చుకోవచ్చు. ఆ తరువాత పేరు మారిందంటే దాదాపు రూ.9 వేలు కట్టాల్సిందే. ప్రస్తుతం అతి పొడవైన పేరున్న వ్యక్తిగా ఎడిన్‌బర్గ్‌కు చెందిన వ్యక్తి గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఆయన పేరు 29 అక్షరాలు ఉంటుంది.