'బాంబు' భయంతో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
నైరోబి: 'బాంబు' భయంతో ఎయిర్ ఫ్రాన్స్ విమానం కెన్యా తీరప్రాంత నగరం మొంబాసాలో అత్యవసరంగా దిగింది. మారిషస్ నుంచి పారిస్ వెళుతున్న బోయింగ్ 777 ఎయిర్‌ఫ్రాన్స్ విమానం (463)లో లావెటరీలో అనుమానాస్పద పరికరం కనిపించింది. దీనిని బాంబుగా అనుమానించిన పైలట్లు మొంబాసాలోని మొయి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని దింపేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని, ఇందుకు ఎయిర్‌పోర్ట్ అధికారులు అంగీకరించడంతో శనివారం అర్ధరాత్రి 12.37 గంటల సమయంలో విమానం అత్యవసరంగా దిగిందని పోలీసులు తెలిపారు.
విమానంలో 459 మంది ప్రయాణికులు, 14మంది సిబ్బంది ఉన్నారు. విమానం శనివారం రాత్రి మారిషస్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరింది. లావెటరీలో పేలుడు పదార్థంలాంటి పరికరం ఉండటంతో ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఆ తర్వాత అనుమానిత పరికరాన్ని విమానం నుంచి బయటకు తీసుకెళ్లి పరీక్షలు జరుపుతున్నారు. బాంబు నిర్వీర్య బృందాలు ఈ పరికరాన్ని పరిశీలిస్తున్నాయి.