
బుడగ విమానం
విమానమెక్కాలంటే... అది ఉండే చోటుకెళ్లాలి. ఆ తరువాత విమానం రన్‌వేపై పరుగులు పెట్టాలి. పెకైగరాలి. ఇదీ తంతు. ఫొటోలో కనిపిస్తోందే... ఇదీ విమానమే. కాకపోతే రన్‌వే అవసరం లేదు! అంతేకాదు, ఎయిర్‌పోర్టుల అవసరమే లేకుండా ఎక్కడపడితే అక్కడ ఆఖరుకు నీటిపైనైనా, మంచు పర్వతాల పైనైనా ల్యాండైపోతుంది. ఇంధనమన్నది నింపుకోకుండా ఏకంగా రెండు వారాలపాటు గాల్లో ఎగురుతూనే ఉంటుంది. అన్నట్టు ఈ విమానం పేరు చెప్పలేదు కదూ... ‘ఎయిర్‌ల్యాండర్ 10’. బ్రిటన్‌లోని హైబ్రిడ్ ఎయిర్‌వెహికల్స్ సంస్థ దీనిని తయారు చేసింది. దీని ప్రత్యేకతల్లో పైన చెప్పినవి కొన్నే. నిజానికి ఇది పూర్తిస్థాయి విమానం కూడా కాదు.
గాలికంటే తేలికగా ఉన్న హీలియం వాయువు నింపిన బుడగ. అడుగున మనుషులు ప్రయాణించేందుకైనా లేదా సరుకులు రవాణా చేసేందుకైనా ఏర్పాట్లు ఉంటాయి. ఎయిర్‌ల్యాండర్ 10 దాదాపు పదిటన్నుల బరువు మోయగలదు. దీని సైజు కూడా ఇందుకు తగ్గట్టుగానే ఉంటుంది. దాదాపు 300 అడుగుల పొడవు, 112 అడుగుల వెడల్పు ఉండే ఎయిర్‌ల్యాండర్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో 2500 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు. దీంట్లో ఎంత హీలియం నింపారో తెలుసా? పదమూడు లక్షల ఘనపుటడుగులు! ఇంకోలా చెప్పాలంటే 15 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్‌పూల్స్‌లో పట్టే నీళ్లంతన్నమాట! మామూలు విమానాలతో పోలిస్తే అతితక్కువ ఇంధనం వాడుతుంది.
అలాగే ఏ మాత్రం శబ్దం కూడా చేయదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? నిర్మాణం పూర్తి చేసుకుని వారం రోజుల క్రితమే ఇది తన తొలి పరీక్ష పూర్తి చేసుకుంది. త్వరలో వాణిజ్యస్థాయిలో కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఓహ్! ఇంకో విషయం. 1930 ప్రాంతంలో జర్మనీ ఇలాంటి విమానాలనే జెప్పెలిన్స్ పేరుతో తయారు చేసింది. కాకపోతే ఒక ప్రమాదంలో దాదాపు 35 మంది చనిపోవడంతో గాలిబుడగల ద్వారా విమాన ప్రయాణమన్న కాన్సెప్ట్ మరుగున పడిపోయింది. ఎయిర్‌ల్యాండర్ 10తో ఆ పరిస్థితి రిపీట్ కాకపోవచ్చని అంచనా.