మరో మహాయుద్ధం పొంచి ఉందా? | all countries are fear about possible of world war 3 | Sakshi
Sakshi News home page

మరో మహాయుద్ధం పొంచి ఉందా?

Published Mon, Apr 24 2017 1:58 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

మరో మహాయుద్ధం పొంచి ఉందా? - Sakshi

మరో మహాయుద్ధం పొంచి ఉందా?

మూడో ప్రపంచ యుద్ధంపై పెరుగుతున్న భయాలు
దేశాధినేతల నోట తరచుగా ప్రస్తావనలు.. హెచ్చరికలు
ఆందోళనలు పెంచుతున్న ప్రపంచ పరిణామాలు
క్రిమియా నుంచి సిరియా, కొరియాల వరకూ ఉద్రిక్తతలు
అమెరికా, రష్యా, చైనాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం
భారత్‌–పాక్‌–చైనా మధ్య యుద్ధ భయాలు


సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
ప్రపంచ దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. అంతకంతకూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. తూర్పు యూరప్‌లో సైనిక పదఘట్టనలు మిన్నంటుతున్నాయి. పశ్చిమాసియా పేలుళ్లతో దద్దరిల్లుతోంది. దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల రద్దీ పెరుగుతోంది. దక్షిణాసియాలో సరిహద్దులు ఉద్రిక్తమవుతున్నాయి. దేశదేశాలు సైనిక పాటవాలకు పదును పెడుతున్నాయి. పరిణామాలను చూస్తే ప్రపంచం మరో మహాయుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కీలక సలహాదారుడు బానన్, బ్రిటన్‌ మాజీ ప్రధాని కామెరాన్, సోవియట్‌ రష్యా చివరి నాయకుడు గోర్బచేవ్, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ మంత్రులు వంటి అగ్రరాజ్యాల అధినాయకుల నోటి వెంట మూడో ప్రపంచ యుద్ధం మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘర్షణ ముదిరినా.. అది అనూహ్యంగా ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం ఎక్కడ ఎలా మొదలు కావచ్చనే అంశంపై అంతర్జాతీయ మీడియాలో విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.

నిప్పు ఎక్కడ రాజుకోవచ్చు?:
మొదటి ప్రపంచ యుద్ధం 1914లో యూరప్‌లో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా 1939లో యూరప్‌లోనే ఆరంభమైంది. అందుకు ప్రధాన కారణం.. అప్పుడు ప్రపంచంలో బలమైన శక్తులు అక్కడ కేంద్రీకృతమై ఉండటమే. ఆ యుద్ధాలు రెండూ అనూహ్యంగా వచ్చిపడ్డవే. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరప్‌లో శాంతి, సామరస్యాలు వర్ధిల్లుతూ వచ్చాయి. 1962లో క్యూబా క్షిపణి సంక్షోభం.. ప్రపంచాన్ని అణుయుద్ధం అంచులవరకూ తీసుకెళ్లినా.. అగ్ర రాజ్యాల సంయమనంతో ఉద్రిక్తతలు చల్లారాయి. అనంతరం సోవియట్‌ రష్యా పతనంతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయి.. ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు తొలగిపోయాయని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

యూరప్‌ దేశాల ఐక్యత విచ్ఛిన్నమవుతోంది. సోవియట్‌ పతనంతో బలహీనపడిందనుకున్న రష్యా బలం పుంజుకుంది. పశ్చిమాసియాలో అగ్రరాజ్యాల మధ్య పరోక్ష యుద్ధం సాగుతోంది. ఆసియాలో చైనా బలపడటం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కొరియా అణ్వస్త్ర బలం ప్రపంచానికే ముప్పుగా కనిపిస్తోంది. భారత్‌–పాకిస్తాన్‌–చైనా మధ్య కశ్మీర్, సరిహద్దుల వివాదం ముదురుతోంది. ఈ పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడి నుంచైనా మొదలుకావచ్చునని నిపుణులు చెబుతున్నారు.

యురేసియా (యూరప్‌–అమెరికా–రష్యా):
క్రిమియాను రష్యా కలిపేసుకోవడంతో యూరప్‌–రష్యా మధ్య రెండో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని 2014లోనే అంతర్జాతీయ మేగజీన్‌ ‘టైమ్‌’ ప్రకటించింది. పుతిన్‌ సారథ్యంలోని రష్యా.. ఉక్రెయిన్‌ సంక్షోభంలో కూడా జోక్యం చేసుకోవడం విస్తరణవాదంగా పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. ఇక నాటోకు కాలం చెల్లిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు యూరప్‌ దేశాల్లో ఆందోళన రేకెత్తించాయి. రష్యా–యూరప్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా ప్రత్యక్ష యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణుల అంచనా.

పశ్చిమాసియా (సిరియా–రష్యా–అమెరికా)
అమెరికాపై 9/11 ఉగ్రదాడి అనంతరం అఫ్గాన్, ఇరాక్‌లపై అమెరికా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో ఐసిస్‌ వంటి భయంకర ఉగ్రవాద సంస్థలు బలపడ్డాయి. సిరియాలో బషర్‌ అల్‌–అసద్‌ సర్కారును కూల్చగలిగితే ప్రపంచంలోని సుసంపన్న చమురు నిల్వలపై అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం లభించేది. కానీ అసద్‌ సర్కారుకు రష్యా అండగా ఉండటంతో.. సిరియా భూమికగా అమెరికా–రష్యాలు మళ్లీ ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ ఘర్షణ ముదిరి భారీ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర కొరియా–చైనా–అమెరికా
ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతం కొరియా ద్వీపకల్పం. ఉత్తర కొరియా అణ్వస్త్రాలు, క్షిపణుల పరీక్షల పరంపరతో ప్రపంచాన్ని వేడెక్కిస్తోంది. ఆ దేశం దూకుడును నియంత్రించడానికి అవసరమైతే ఏకపక్షంగా చర్యలు చేపడతామని అమెరికా హెచ్చరించింది. యుద్ధనౌకలను కూడా ఆ దేశానికి సమీపంలోకి పంపించింది. అమెరికాతో జపాన్‌ జతకట్టి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. అమెరికా సంయమనం పాటించాలని ఉత్తర కొరియా మిత్రదేశమైన చైనా చెబుతోంది. అదే సమయంలో యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి తన సైన్యాన్ని సమాయత్తం చేస్తోంది. అమెరికా బెదిరింపు చర్యలను చూసి ఉత్తరకొరియా ముందస్తు దాడులకు దిగే ప్రమాదం ఉందని.. అదే జరిగితే ఉ.కొరియా, చైనా, రష్యా–దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ల మధ్య భారీ యుద్ధం రావచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్‌–ఇజ్రాయెల్‌–అమెరికా:
ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేస్తానని ట్రంప్‌ ప్రకటించారు. అలా రద్దు చేయడమంటే.. ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్‌ సైనిక దాడులు చేయడమే. అలా జరిగితే ఇరాన్‌ ఆ దేశాలతో యుద్ధానికి దిగుతుంది. ఇరాన్‌ మిత్రపక్షమైన రష్యాతోపాటు కొన్ని పశ్చిమాసియా మిత్రులు కూడా యుద్ధానికి దిగవచ్చు. అమెరికా వైపు నాటో దేశాలు, సౌదీ అరేబియా వంటి అరబ్‌ దేశాలు యుద్ధానికి దిగక తప్పదు. అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుంది.

ఆసియా పసిఫిక్‌ (అమెరికా–జపాన్‌–చైనా):
ఆర్థికంగా, సైనికంగా వేగంగా బలపడుతున్న చైనాతో తనకు ఇబ్బందులు ఉంటాయని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనాను కట్టడి చేయడానికి తన నౌకాదళ స్థావరాల్లో 60 శాతాన్ని ఆసియాకు బదిలీ చేసింది. జపాన్‌ తదితర తూర్పు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఇటీవలి కాలంలో చైనా–జపాన్‌ మధ్య కొన్ని దీవుల విషయంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా–చైనా మధ్య దక్షిణ చైనా సముద్రం విషయంలో గొడవలు ముదురుతున్నాయి. అమెరికా–చైనా రెండూ ముఖాముఖి తలపడే దిశగా పయనిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.

దక్షిణాసియా (ఇండియా–పాక్‌– చైనా–అమెరికా): 
భారత్‌–పాకిస్తాన్‌ మధ్య కశ్మీర్‌పై ఇప్పటికే మూడు యుద్ధాలు జరిగాయి. పాకిస్తాన్‌కు చైనా మద్దతిస్తోంది. ఒబామా హయాంలో అమెరికా–భారత్‌ మధ్య బంధం బలపడినప్పటికీ.. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికా వైఖరిపై గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అధీన రేఖ వెంట ఉద్రిక్తతలు పెరిగిపోయి ఏ పక్షం సైనిక చర్యలను పెంచినా అది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయొచ్చని, ఆ యుద్ధంలోకి అమెరికా, చైనాలు కూడా ప్రవేశించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అటు భారత్‌–చైనా మధ్య కూడా సరిహద్దు సమస్య ఉంది. ఇప్పటికే చైనా–భారత్‌ మధ్య ఒక యుద్ధం జరిగింది. సరిహద్దు వివాదం మరో యుద్ధానికి దారితీస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మూడో ప్రపంచ యుద్ధంపై ఎవరేమన్నారు?
‘‘ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రపంచం యుద్ధానికి సంసిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. నాటో–రష్యాలు పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్లో మోహరించాయి’’
– మిఖాయిల్‌ గోర్బచేవ్, సోవియట్‌ రష్యా చివరి అధ్యక్షుడు (జనవరి 2017)

‘‘వాళ్లు మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఒత్తిడి చేస్తున్నారు..’’
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (జనవరి 2017లో–ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ ఉత్తర్వును విమర్శించిన డెమొక్రాట్లను ఉద్దేశిస్తూ..)

‘‘ఉత్తర కొరియాపై చేయి వేస్తే.. జనం తుపాకులు, క్షిపణులతో రక్షించుకుంటారు. మా వద్ద థెర్మోన్యూక్లియర్‌ బాంబు ఉంది. మూడు బాంబులతో ప్రపంచం అంతమవుతుంది..’’
– ఉత్తర కొరియా అనధికారిక దౌత్యవేత్త అలెజాండ్రో చావో ది బెనోస్‌ (ఏప్రిల్‌ 2017)


‘‘ఈ ఏడాది మే 13న మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ట్రంప్‌ ఈ యుద్ధాన్ని ఆరంభిస్తారు. పెను విధ్వంసం, భారీ మరణాల తర్వాత అక్టోబర్‌ 13న యుద్ధం ముగుస్తుంది.’’
– హోరిసియో విలేగస్‌ (ఏప్రిల్‌ 2017– ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అవుతారని 2015లోనే చెప్పిన జోస్యుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement