ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అవిశ‍్వాస తీర్మానంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, అవిశ్వాస తీర్మాణానికి ముందు ఇమ్రాన్.. సంచలన కామెంట్స్ చేశారు. పదవి కోల్పోవడానికి కొద్ది రోజుల ముందు కూడా తనపై విదేశీ కుట్రలు జరుగుతున్నాయని కామెంట్స్ చేశారు. తాజాగా స్వరం మార్చి వార్తల్లో నిలిచారు.
కాగా, ఇమ్రాన్‌ఖాన్ తన మద్దతుదారులతో కలిసి.. కరాచీలో భారీ ర్యాలీ తలపెట్టారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ దేశానికి వ్యతిరేకం కాదు. భారత్, ఐరోపా, అమెరికా.. దేన్నీ ద్వేషించడం లేదు. ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు’’ అని కామెంట్స్ చేశారు. అయితే, గతంలో ఇమ్రాన్ ఖాన్ పలు సందర్భాల్లో భారత్, అమెరికా సహా కొన్ని ఐరోపా దేశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ ఉద్రిక్తల సమయంలో మాస్కోలో పర్యటించడం నచ్చకనే అమెరికా తనను గద్దె దించాలని కుట్ర చేసిందని ఆరోపించాడు.
ఈ క‍్రమంలోనే భారత్‌పై కూడా ఇమ్రాన్ కీలక వ్యాఖ‍్యలు చేశాడు. భారత్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి. అక్కడి ప్రజలు తమ దేశాన్ని గర్వంగా భావిస్తుంటారు. అందుకు కారణం.. ఏ మహాశక్తివంతమైన దేశాలు కూడా వాళ్లను శాసించలేవు కాబట్టి. వాళ్ల విధానాలు వాళ్లకు ఉంటాయి. అక్కడి రాజకీయాల్లోనూ బయటి శక్తుల జోక్యం ఉండదు. అందుకే భారత్‌ను ఏ దేశం శాసించలేదని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం విదేశాల్లో సెటిలైన పాకిస్తానీల నుంచి విరాళాలు అడగటం మొదలుపెట్టినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment