'నేను పాజిటివ్... నన్ను తాకండి'
మనుషులలో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుందని అందరు అంటుంటారు... కానీ సామాజిక స్పందనపై చేసిన ఓ సంఘటన అది తప్పు అని నిరూపించింది. జేన్ అంటిన్ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం హెచ్ఐవీ సంక్రమించింది. అయితే తనకు ఆ వ్యాధి ఉందని చెబితే చుట్టుపక్కల వాళ్లు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని అతడు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ తతంగాన్ని కెమెరాలో బంధించి ఆ తర్వాత వివరాలను నెట్ లో అప్లోడ్ చేయడంతో వీడియో హల్ చల్ చేస్తుంది. 'నేను హెచ్ఐవీ పాజిటివ్.. నన్ను తాకండి' అని రాసిన రెండు కాపీలు జేన్ తనకు ఇరువైపులా ఉంచి రద్దీగా ఉన్న ఓ స్ట్రీట్ లో నిలుచుంటాడు.
తొలుత కొద్ది క్షణాలు ఎవరూ అతడిని తాకరు. ఆ తర్వాత ఒక్కక్కరుగా చాలా మంది అతనికి తాకుతారు. అతడిని తాకిన వారిలో చిన్నారులు, యువతీయువకులు, ఇతర అన్ని వయసుల వారు ఉండటం గమనార్హం. మరికొంతమంది ఏకంగా అతడిని కౌగిలించుకుని తమ ప్రేమను, సానుభూతిని తెలిపి మానవత్వాన్ని చాటుకోవడం విశేషం. తనను తాకిన వారందరికి జేన్ కృతజ్ఞతలు చెబుతుంటాడు. తన మనసులోని బాధను మరిచిపోయి, అతని కళ్లు చెమ్మగిల్లుతాయి. అవి కన్నీళ్లు ఏ మాత్రం కావు.. కొత్త వ్యక్తులు తను ఎవరో తెలియనప్పటికీ వారు చూపించిన అప్యాయతకి జేన్ ఆనందభాష్పాలు రాల్చాడు.