కేన్సర్ చికిత్సను మరింత ప్రభావవంతం చేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, మూర్స్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు మరో కీలకమైన ఆవిష్కరణ చేశారు. శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గించే ఓ యంత్రాంగాన్ని కనుగొన్నారు. రోగ నిరోధక వ్యవస్థ ద్వారా కేన్సర్‌కు చికిత్స అందించే ప్రక్రియలకు ఈ పరిశోధన మరింత ఊతమివ్వనుంది. శరీరంలోకి హానికర సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు తెల్లరక్త కణాలు రంగంలోకి దిగి కొన్ని రకాల ప్రొటీన్లను విడుదల చేస్తాయి. వీటి ద్వారా చైతన్యవంతమైన రోగ నిరోధక కణాలు సూక్ష్మజీవులపై దాడి మొదలుపెడతాయి.
ముప్పు తొలగిందనుకున్నప్పుడు తెల్లరక్త కణాలు మరో రకమైన ప్రొటీన్లతో రోగనిరోధక కణాలు నెమ్మదించేలా చేసి కణజాలాన్ని మరమ్మతు చేయడం మొదలుపెడతాయి. అయితే కేన్సర్ వంటి వ్యాధుల్లో ఈ ప్రక్రియ సక్రమంగా నడవదు. తెల్లరక్త కణాలు చాలా ఎక్కువ స్థాయిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రొటీన్లను విడుదల చేస్తుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి మందగించేలా చేయడంతో కణజాలాల మరమ్మతు ప్రక్రియ జరగదు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ద్వారా తెల్లరక్త కణాలలో ఉండే ఓ ఎంజైమ్.. రోగ నిరోధక శక్తి మందగించేలా చేస్తుందని స్పష్టమైంది. ఎలుకల్లో ఈ ఎంజైములను చైతన్యవంతం చేసినప్పుడు కేన్సర్ కణితుల పెరుగుదలను సమర్థంగా అడ్డుకోగలిగాయని పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎజ్రా కోహెన్ తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
కేన్సర్ చికిత్సలో మరో ముందడుగు
Published Wed, Sep 21 2016 6:19 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
Advertisement
Advertisement