
లబ్‌డబ్ ‘త్రీడీ’గుండె!
ఫొటోలో ఉన్నది ఆకారంలో మాత్రమే గుండె కాదు.. లబ్‌డబ్ అంటూ కొట్టుకుంటుంది కూడా.జ్యూరిచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సిలికోన్ పదార్థాన్ని ఉపయోగించి త్రీడీ ప్రింటర్ ద్వారా దీన్ని ముద్రించారు. దీనిలోపల కూడా మనిషి గుండె మాదిరిగానే కవాటాలు ఉంటాయి. తగిన ఒత్తిడి కలిగిస్తే కవాటాల్లోని ద్రవాన్ని బలంగా బయటకు పంపుతాయి కూడా. అన్నీ బాగున్నాయిగానీ.. ప్రస్తుతానికి దీంట్లో ఒక చిక్కుంది.
ఈ కృత్రిమ గుండె మూడు వేల సార్లు మాత్రమే కొట్టుకోగలదు. అంటే.. 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకే గుండెకు బదులుగా వాడుకోవచ్చన్నమాట. అయితే దీన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో గుండెలా పనిచేసేందుకు ఉపయోగించే హార్ట్–లంగ్ యంత్రాన్ని ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇది భారీసైజులో ఉండటం.. ఆసుపత్రుల్లో మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉండటం వల్ల హార్ట్ లంగ్ యంత్రాలకు మెరుగైన ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.