కొనసాగుతున్న దాడులు: 32 మంది హతం
బీరట్: సిరియాపై.. యూఎస్ ఆధ్వర్యంలోని సంకీర్ణ దళాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఆదివారం జరిపిన భీకరదాడుల్లో 32 మందికి పైగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సిరియాలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న వైమానికి దాడులు రఖ్వా ప్రావిన్స్లో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
సిరియాలో ఉత్తర, తూర్పు ప్రాంతాలలో తలదాచుకున్న జిహాదీలను మట్టుపెట్టే లక్ష్యంతో సంకీర్ణ దళాలు భీకరమైన పేలుళ్లకు పాల్పడుతోంది. ఉగ్రవాద సంస్థ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. కాగా ఇటీవల దాడుల నేపథ్యలో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు.. రఖా వైపుకు పారిపోతున్నట్టు వార్తల నేపథ్యంలో రఖా టార్గెట్గా దాడులకు దిగింది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు సిరియాపై భీకరంగా వైమానిక దాడులు చేస్తున్నాయి. పారిస్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆ దాడులను మరింత ముమ్మరం చేశాయి.