
మా ఆయన గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదే!
సిడ్నీ: ప్రపంచంలో విలాస పురుషుడు ఎవరంటే ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్త ట్రేవర్స్ బేనన్(44) అని చెప్పవచ్చు. అతడికి ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ జాబితా చెప్పడమూ కష్టమేనని స్వయంగా అతడి భార్య తాయేశానే వెల్లడించడం గమనార్హం. క్వీన్స్‌లాండ్ కుబేరుడు ట్రేవర్స్ బేనన్‌కు తాయేశా రెండో భార్య. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2011లో తాయేశాను వివాహం చేసుకున్నాడు. తనను తాను కింగ్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్‌గా చెప్పుకునే బేనన్‌కు అమ్మాయిలంటే విపరీతమైన పిచ్చి.
ఓసియన్ రోడ్ మ్యాగజైన్‌కు తాయేశా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు చెప్పింది. తన భర్తకు లెక్కలేనంత మంది మహిళలతో సంబంధాలున్నాయని, అతడికి ఎంతమంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నా నాకేంటి.. భార్యను మాత్రం నేనొక్కదాన్నే అని సంబరపడింది తాయేశా. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా పేరున్న బేనన్ రోజూ రాత్రి నలుగురు మహిళలతో గడుపుతాడని అక్కడ ప్రచారంలో ఉంది. బేనన్ విచ్చలవిడి వ్యవహారం తెలిసిన తాయేశా వాళ్ల పెద్దలు అతడితో పెళ్లికి నిరాకరించారు. 'పెద్దల అనుమతించకపోయినా బేనన్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నా వివరాలపై మా పెద్దలు వాకబు చేయలేదు. నా భర్త బేనన్ నా జీవితం నాశనం చేసి ఉంటాడని వారు భావిస్తుంటారు' అని తాయేశా చెప్పుకొచ్చింది.
బేనన్ తొలి వివాహం 1991లో నినిబెత్ బిట్రీజ్ జిమినెజ్ లీయల్ తో జరిగింది. ఆమె ఏ అనామకురాలో కాదు. 1991లో ప్రపంచ సుందరి టైటిల్ నెగ్గిన మహిళ. దాదాపు 17 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2008లో జిమినెజ్ లీయల్ కు విడాకులిచ్చాడు. తొలి భార్యతో కలిసి ఉన్నప్పుడే తాయేశాతో వివాహేతర సంబంధం కొనసాగించాడు బేనన్. తాయేశాతో వివాహం జరిగిన తర్వాత అతడి చేష్టలు మరింత ఎక్కువయ్యాయి. ఎప్పుడూ అందగత్తెలతో తిరుగుతూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఉండేవాడు. రెండో భార్య బేనన్ పనులకు అడ్డు చెప్పకపోగా.. భార్యగా మాత్రం తనను బాగా చూసుకుంటాడంటూ వెనకేసుకొస్తోంది.