ట్రంప్‌ బాటలోనే ఆస్ట్రేలియా | Australia scraps visa for skilled foreign workers | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ బాటలోనే ఆస్ట్రేలియా

Published Wed, Apr 19 2017 1:41 AM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM

ట్రంప్‌ బాటలోనే ఆస్ట్రేలియా - Sakshi

ట్రంప్‌ బాటలోనే ఆస్ట్రేలియా

వర్క్‌ వీసా పాలసీ ‘457 వీసా’ రద్దు
► దాని స్థానంలో కొత్త విధానం తీసుకురానున్న ఆసీస్‌
► ఇంగ్లిషు సామర్థ్యం, వృత్తి నైపుణ్యం ఉన్న వారికే అవకాశం
► భారతీయులు సహా 95 వేల మంది విదేశీయులపై ప్రభావం


మెల్‌బోర్న్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాటలోనే ఆస్ట్రేలియా కూడా పయనిస్తోంది. తమ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు అత్యంత ప్రాచుర్యం పొందిన వర్క్‌ వీసా పాలసీ 457 వీసాను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారతీయులు సహా 95 వేల మంది విదేశీ ఉద్యోగులు ఈ వర్క్‌ వీసా ద్వారానే ఆస్ట్రేలియాలో ఉపాధి పొందుతున్నారు. దీని స్థానంలో ఇంగ్లిషులో మెరుగైన సామర్థ్యం.. వృత్తి నైపుణ్యానికి ప్రాముఖ్యతలను ఇచ్చే కొత్త పాలసీని తీసుకురానుంది. కాగా, ఆస్ట్రేలియా తాజా నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం చూపుతుందని వీసా నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఏమిటీ 457 వీసా..
‘457 వీసా’.. ఆస్ట్రేలియాలో విదేశీయులను నైపుణ్య ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఉపయోగించే విధానమిది. 1990ల్లో వ్యాపారులకు, అత్యున్నత నిపుణత కలిగిన వలసదారుల కోసం తెచ్చిన ఈ విధానాన్ని ఆ తర్వాత మరింత విస్తరించారు. ఈ వీసాపై వచ్చిన వాళ్లు నాలుగేళ ్లపాటు ఆస్ట్రేలియాలో పని చేయవచ్చు.

గత ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి ఆస్ట్రేలియాలో ప్రాథమిక 457 వీసాలపై పని చేస్తున్న వారి సంఖ్య 95,757. సెకండరీ వీసాదారులు(457 వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు) 76,430 మంది ఉన్నట్టు సమాచారం. 457 వీసాలను వినియోగించుకునే వాళ్లలో మెజారిటీ సంఖ్య భారతీయులదే. ఈ వీసాలను తీసుకునే భారతీయుల సంఖ్య 19.5% కాగా.. యూకే, చైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే నైపుణ్యంలేని వారిని తక్కువ వేతనం కోసం తీసుకుంటూ ఈ విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పాలసీని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది.

ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యత: టర్న్‌బుల్‌
‘‘మాది ఒక వలస దేశమనే విషయం తెలుసు. కానీ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆస్ట్రేలియా ఉద్యోగాల్లో ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యత దక్కాలి. అందువల్ల ‘457 వీసా’ను రద్దు చేయాలని నిర్ణయించాం. ఇకపై 457 వీసాలను జారీ చేయబోం. ఈ వీసా కింద ఇచ్చే ఉద్యోగాలు ఇకపై ఆస్ట్రేలియన్లకే దక్కాలి’’ అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్‌ స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన విదేశీయుల కోసం కొత్తగా ‘ఆస్ట్రేలియా ఫస్ట్‌’ అనే విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు. కొత్త వీసా విధానం తక్షణం అమలులోకి వస్తుందని, దీనిని పూర్తిగా అమలులోకి తీసుకువచ్చే ప్రక్రియ 2018 మార్చి నాటికి పూర్తవుతుందని చెప్పారు.

కొత్త విధానంలో ఉన్నతమైన ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం, క్రిమినల్‌ హిస్టరీ చెక్, లేబర్‌ మార్కెట్‌ టెస్టింగ్, నాన్‌ డిస్క్రిమినేషన్‌ వర్క్‌ఫోర్స్‌ టెస్ట్, మార్కెట్‌ శాలరీ రేట్‌ అసెస్‌మెంట్‌ వంటి నిబంధనలతో పాటు కొత్తగా రెండేళ్ల వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను తప్పనిసరి చేయనున్నారు. కొత్తగా రూపొందించనున్న ‘టెంపరరీ స్కిల్‌ షార్టేజ్‌ వీసా’ విధానం షార్ట్‌ టర్మ్, మీడియం టర్మ్‌ అనే రెండు స్ట్రీమ్‌లుగా ఉండనుంది. షార్ట్‌టర్మ్‌ వీసాలను రెండేళ్లకు.. మీడియం టర్మ్‌ వీసాలను మరింత కఠినమైన స్కిల్‌ షార్టేజ్‌ ఉద్యోగాల కోసం నాలుగేళ్ల వరకూ జారీ చేస్తారు.

హెచ్‌–1బీపై సంతకం!
హెచ్‌–1బీ వీసాల జారీని కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మంగళవారం (ఏప్రిల్‌ 18న) సంతకం చేయనున్నట్లు సమాచారం. దీని ప్రభావం భారతీయ ఐటీ కంపెనీలు, నిపుణులపై తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి హెచ్‌–1బీ వీసాలను అత్యున్నత వృత్తి నిపుణులకు మాత్రమే జారీ చేయనున్నారు. కాగా, 2018 ఏడాదికి హెచ్‌–1బీ వీసా కోసం మొత్తం 1,99,000 దరఖాస్తులు రాగా, 65 వేల వీసాలను లాటరీ పద్ధతిలో కేటాయించారు. వీటితోపాటు మరో 20 వేల వీసాలు అమెరికా ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విదేశీయులకు దక్కాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement