టర్న్‌బుల్‌కే ఆసీస్ ప్రధాని పీఠం!
ఓటమిని అంగీకరించిన విపక్ష నాయకుడు
మెల్‌బోర్న్ : ఉత్కంఠరేపిన పోరులో ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా 61 ఏళ్ల మాల్కమ్ టర్న్‌బుల్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. హోరాహోరీగా సాగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని టర్న్‌బుల్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ కూటమి విజయం సాధించింది. దీంతో 8 రోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపునకు ఆదివారంతో తెరపడింది. మొత్తం 150 సీట్లున్న పార్లమెంటులో లిబరల్-నేషనల్ కూటమి 74 స్థానాలు దక్కించుకుంది. బిల్ షార్టెన్ నాయకత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ 66 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగిలిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటే లిబరల్-నేషనల్ కూటమికి 76 సీట్లు కావాలి.
ఈనెల 2న ఎన్నికలు జరిగాయి. ఈ విజయం అందరి కృషి ఫలితమని టర్న్‌బుల్ చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి సహకరించి, తమను గెలిపించిన ఆస్ట్రేలియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. సుస్థిర పాలనే తమకు పట్టం కట్టిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈసారి పార్లమెంటులో చాలా కొత్త ముఖాలు కనిపించనున్నాయని, వారిలో గొప్ప నాయకులెందరో ఉన్నారన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నానన్నారు. ‘భవిష్యత్ తరాలకు మేం ట్రస్టీలం. కనుక ఏం చేసినా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేయాలి’ అని ప్రధాని అన్నారు. గవర్నర్ జనరల్ విదేశీ పర్యటనలో ఉన్నందున టర్న్‌బుల్ ప్రమాణస్వీకారోత్సవానికి కనీసం వారం రోజులు పట్టేట్టుందని స్థానిక మీడి యా సమాచారం. ఫలితాల వెల్లడికి ముందే విపక్ష నాయకుడు షార్టెన్ సంచలనాత్మకంగా తన ఓటమిని అంగీకరించారు. ఆసీస్ ప్రధాని మళ్లీ టర్న్‌బుల్లే అని, ప్రజా సంక్షేమంలో ఆయనకు తన మద్దతు ఉంటుందన్నారు.