ఆగిన పెళ్లి.. ప్రధాని హర్షం!
► పెళ్లికి అడ్డంకిగా మారిన ఫేస్‌బుక్ పోస్ట్
సిడ్నీ: సోషల్ మీడియాలో తాను చేసిన ఓ పోస్ట్ ఏకంగా తన పెళ్లినే ఆపేస్తుందని ఆ యువతి భావించలేదు. ఆమె ఫేస్‌బుక్ పోస్టును సాకుగా చూపిస్తూ చర్చి నిర్వాహకులు మరికాసేపట్లో జరగబోయే యువతి వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో చోటుచేసుకుంది. ఇంతకు యువతి చేసిన పోస్ట్ ఏంటంటారా.. స్వలింగ సంపర్క వివాహాలకు మద్ధతు తెలుపుతూ తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేయడమే.
విక్టోరియాలోని బల్లారట్‌లో ఓ చర్చిలో యువతి, తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి వచ్చింది. చర్చి పెద్దలు వారి వివరాలు కనుక్కున్నారు. మరికాసేపట్లో వివాహం జరగనుండగా స్వలింగ సంప్కర వివాహానికి (గే మ్యారేజ్) మద్ధతుగా వధువు చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ గురించి తెలుసుకున్న మత పెద్దలు కార్యక్రమాన్ని రద్దుచేశారు. వివాహాలకు సంబంధించిన చట్టాలలో మార్పులు తీసుకురావాలని తన పోస్ట్‌లో ఆమె పేర్కొంది. ఇలాంటి తరహా వివాహాలకు (గే, లెస్బియన్ వివాహాలు) ఇక్కడ చట్టబద్ధత లేదని చర్చి మినిస్టర్ ఎబెనజర్ సెయింట్ జాన్ వెల్లడించారు.
వివాదానికి కారణమైన యువతి ఎఫ్‌బీ పోస్ట్‌పై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ స్పందించారు. పెళ్లిని నిలిపివేస్తూ చర్చి మినిస్టర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతించాలి. ఇంకా చెప్పాలంటే చర్చికి ఉన్న ప్రత్యేక అధికారాల కారణంగా వారు ఆ వధువు పెళ్లిని నిలిపివేశారని చెప్పారు. క్యాథలిక్ చర్చిలో అయితే రెండోపెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారి వివాహాన్ని సమ్మతించరని వెల్లడించారు.