
'హలో.. ట్రంప్ గొడవొద్దు'.. నాక్కాదు చెప్పేది..
బీజింగ్: రాత్రికి రాత్రే ఉత్తర కొరియాపై యుద్ధానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చైనా జోక్యం చేసుకోంది. శనివారం ఏకంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రంగంలోకి దిగి అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసి సముదాయింపు చర్యలకు దిగారు. దయచేసి ఒకరినొకరు రెచ్చగొట్టుకునే మాటలు ఆపేయ్యాలని, ఉద్రిక్త పరిస్థితులు మరింత పెద్దవి చేసే పనులు మానుకోవాలని సూచించారు. అంతేకాకుండా కొన్ని ప్రముఖ పార్టీ నేతలకు కూడా ఫోన్‌లు చేసి ఉత్తర కొరియాతో సమస్యను చర్చల ద్వారా, రాయబారాల ద్వారా, రాజకీయంగా పరిష్కరించుకోవాలే తప్ప యుద్ధం ద్వారా కాదని కోరారు.
కొరియా ద్వీపంలో అణు పరీక్షలు జరగకుండా అణ్వాయుధాల తయారీలేకుండా తటస్థీకరించడమే అమెరికా, చైనాల అజెండా అని, ఆ ప్రాంతంలో శాంతి పరిస్థితులు, స్థిరత్వం కొనసాగింపు తమ ఉమ్మడి బాధ్యత అని చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. అయితే, ఈ ఫోన్ కాల తర్వాత అమెరికా, చైనా మధ్య మరింత అవగాహన పెరిగిందని ట్రంప్ అన్నట్లు మీడియా వెల్లడించింది. అయితే, ప్రతిసారి తమకు మాత్రమే చెప్పడం కాకుండా ఉత్తర కొరియాను మొదటగా హెచ్చరించాలని ట్రంప్ కోరారు. ప్రతిసారి ఉత్తర కొరియా మాత్రమే రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందని ట్రంప్ ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో అన్నట్లు తెలిసింది.