నాటింగ్‌హమ్ : చర్మం లేకుండా పుట్టిన ఓ శిశువు ప్రాణాలతో బయటపడి డాక్టర్లను ఆశ్చర్యపరిచాడు. బ్రతకటమే కష్టం అనుకున్న ఆ చిన్నారి ఒంటిపై చర్మంపెరగటంతో డాక్టర్లు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హమ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వార్మిక్‌షేర్‌కు చెందిన జెస్సికా కిబ్లర్, జాక్ శాటక్ భార్యభర్తలు. గర్భవతిగా ఉన్న జెస్సికా పురిటి నొప్పులతో కొద్దిరోజులక్రితం దగ్గరలోని నాటింగ్‌హమ్ సిటీ హాస్పిటల్‌లో చేరింది. అయితే ఆమె చర్మంలేని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. పైగా 10వారాల ముందు పుట్టడంతో బిడ్డ బ్రతకటం కష్టమన్నారు డాక్టర్లు. ఐసీయూలో ఉన్న తమ బిడ్డను మొదటిసారి చూసుకున్న జాక్ దంపతులు షాకయ్యారు. కేవలం ముఖంపై మాత్రమే కొద్దిగా చర్మం ఉండి, మిగిలిన శరీరం మొత్తం.. చర్మంపై పొర లేకుండా మాంసపు ముద్దలా ఉన్న అతడిని చూడగానే వెక్కివెక్కి ఏడ్చారు.
వీరిని చూసిన అక్కడి నర్సులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించకుండా ఐసీయూలో ఉంచి పర్యవేక్షించసాగారు డాక్టర్లు. అయితే ఆరు వారాల తర్వాత ఆశ్చర్యకరంగా బాబు ఒంటిపై చర్మం పెరగటం ప్రారంభమైంది. దీంతో డాక్టర్లు అతడిని తల్లిదండ్రులతో పాటు ఇంటికి తీసుకుపోవటానికి అనుమతించారు. ప్రస్తుతం డాక్టర్లు శస్త్రచికిత్సల ద్వారా అతడి ఒంటిపై చర్మాన్ని అవసరమైన చోటకు మార్పు చేస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలతో బయటపడినందుకు జాక్ దంపతులు ఎంతో సంతోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment