లక్షల రూపాయలతో బ్యాగ్ లు కొనేసింది!
నాలుగేళ్ళ క్రితం ఆమెను నడమంత్రపు సిరి వరించింది. ఓ బ్యాంక్ అనుకోకుండా చేసిన తప్పిదం ఆమెను ధనవంతురాల్ని చేసింది. అప్పనంగా వచ్చిన సుమారు ఏభై లక్షల రూపాయలను ఆమె.. మూడో కంటికి తెలియకుండా ఖర్చు చేసేందుకు చూసింది. అయితే ఆ అదృష్టం కేవలం నాలుగేళ్ళే నిలిచింది. ఆరా తీసిన బ్యాంక్ సిబ్బందికి అసలు విషయం తెలియడంతో ప్రయాణానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెను వలవేసి పట్టుకున్నారు.
మిలియనీర్ గా మారిన 21 ఏళ్ళ క్రిస్టీన్ జియాక్సిన్ లీ.. తనకు కలసి వచ్చిన అదృష్టాన్నినాలుగేళ్ళపాటు రహస్యంగానే ఉంచింది. బ్యాంక్ సిబ్బంది చేసిన తప్పుతో ఆమె అకౌంట్ లోకి వచ్చిన సుమారు 46 లక్షల రూపాయలను ఖరీదైన డిజైనర్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ ల కొనుగోలుకు ఖర్చు చేసేసింది. అయితే నాలుగేళ్ళ తర్వాత ఆమె ఓ ఎమర్జెన్సీ పాస్ పోర్టుతో మలేషియా వెళ్ళేందుకు సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా తన బ్యాంకులో 33 లక్షల రూపాయల వరకూ బ్యాలెన్స్ ఉందని, మిగిలిన డబ్బును తనకిష్టమైన ఖరీదైన వస్తువులు కొనుక్కున్నానని, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని జియాక్సిన్ పోలీసులకు తెలిపింది. డబ్బు వచ్చిందని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, ఆమె స్వంత ఖర్చులకు వినియోగించడాన్ని కోర్టు నేర చర్యగా పరిగణించింది.
సిడ్నీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న జియాక్సిన్ ను అరెస్టు చేసిన పోలీసులు 2014 జూలై నుంచి, 2015 ఏప్రిల్ మధ్య కాలంలో ఆమె అనేక దఫాలుగా ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేసినట్లు చెప్తున్నారు. అయితే కనీసం తనకు వచ్చిన డబ్బు ఏ బ్యాంకు నుంచి వచ్చిందన్న విషయాన్నికూడ తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే జియాక్సిన్ కు బెయిల్ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం... బ్యాంకు చేసిన పొరపాటు గురించి తనకు ఎటువంటి అవగాహనా లేదని, అయితే ఆమె ఖర్చు చేసినట్లు ఆరోపణలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించాడు.