'భారత్పై యుద్ధానికి దిగండి'
న్యూఢిల్లీ: భారతదేశంపై యుద్ధానికి దిగాలని పాకిస్థానీ ప్రజలకు లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ పిలుపునిచ్చాడు. సీఆర్పీఎఫ్ బృందంలోని 8 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులను సింహాలుగా ప్రశంసించాడు. జమాత్ ఉద్ దవా ఉగ్రవాద బృందానికి నెంబర్ 2గా వ్యవహరిస్తున్న మక్కీ.. పాకిస్థాన్లోని గుజ్రన్వాలా ప్రాంతంలో బహిరంగ సభలో మాట్లాడాడు.
రెండు సింహాలు నక‍్కల కాన్వాయ్ని చుట్టుముట్టాయి అని అతడు వ్యాఖ్యానించాడు. అప్పుడే భారతదేశం మీద యుద్ధానికి తెగబడాలని పాక్ వాసులకు పిలుపునిచ్చాడు. మక్కీ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో వేదిక మీద హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. అతడి ప్రసంగం వీడియోను జమాత్ మద్దతుదారులు ఫేస్బుక్ గ్రూపులలో పోస్ట్ చేశారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో హఫీజ్ సయీద్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.