ప్రతీకారం తప్పదు
♦ ఆ స్థాయిలో పాక్ పాశవికత: భారత ఆర్మీ
♦ సైనికుల తలలు నరకడంపై పాక్‌కు తీవ్ర నిరసన తెలిపిన భారత డీజీఎంఓ
♦ స్పష్టమైన ఆధారాలు చూపండి: పాకిస్తాన్
♦ గాజులు తీసేసి ప్రభుత్వం ఏదోకటి చేయాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ/బెంగళూరు: జమ్మూ–కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ ఇద్దరు సైనికుల తలలు నరకడంపై భారత్ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. ఇది అత్యంత క్రూరమైన, అమానవీయ ఘటనగా పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు అర్హమైన రీతిలో పాక్ వ్యవహరించిందని భారత్ ఆర్మీ మంగళవారం స్పష్టం చేసింది.
ఆ మేరకు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ డీజీఎంఓకు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ భారత్ ఆందోళనను తెలియచేశారు. ‘అన్ని మానవీయ విలువల్ని అతిక్రమించి.. క్రూరమైన, పాశవిక చర్యకు పాల్పడ్డారని పాక్ డీజీఎంఓకు భారత డీజీఎంఓ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రతీకార చర్య తప్పదన్న రీతిలో పాక్ వ్యవహరించిందని కూడా స్పష్టం చేశార’ని ఒక ప్రకటనలో ఆర్మీ తెలిపింది.
అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంట బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) శిక్షణ కేంద్రాలు ఉండడంపై ఆందోళన తెలియచేసినట్లు ఆర్మీ వెల్లడించింది. భారత సైనికుల్ని హత్య చేసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ పోస్టు ఈ దుశ్చర్యకు సాయపడిందన్న విషయాన్ని కూడా హాట్‌లైన్ సంభాషణల్లో పాక్ దృష్టికి డీజీఎంవో తీసుకెళ్లారు. ఈ హేయమైన చర్యకు తగిన జవాబు ఇస్తామని ఇంతకుముందే భారత ఆర్మీ ప్రకటించింది. మరోవైపు తాజా ఘటనపై మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి.
ఎల్‌వోసీ వెంట ఎస్‌ఓపీస్‌ను సమీక్షిస్తాం
పాక్ బలగాల దాడి నేపథ్యంలో సరిహద్దు రేఖ వెంట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్‌ఓపీస్)ను భారత ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లు సమీక్షించనున్నాయి. అయితే ఈ విషయమై ఇప్పుడే అధికారికంగా మాట్లాడనని... విధివిధానాల మార్పులో ఎలాంటి సందేహం లేదని, బీఎస్‌ఎఫ్ అదనపు డీజీ కమల్ ఎన్ చౌబే చెప్పారు.
ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదు: పాక్ ఆర్మీ
భారత సైనికుల తలలు నరికినట్లు స్పష్టమైన ఆధారాలు చూపాలని పాకిస్తాన్ ఆర్మీ డిమాండ్ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, భారత సైనికుల తలలు నరికారన్న భారత్ ఆరోపణల్ని పాక్ డీజీఎంఓ తోసిపుచ్చారని ఆ దేశ ఆర్మీ తెలిపింది. కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఆందోళనల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నంగా పాకిస్తాన్ కొట్టిపడేసింది.
‘గన్ కీ బాత్’ ప్రారంభించండి: శివసేన
కేంద్ర ప్రభుత్వంపై మిత్రపక్షం శివసేన మండిపడింది. పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు ‘మన్ కీ బాత్’ని ఆపి ‘గన్ కీ బాత్’ని ప్రారంభించాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ప్రధాని మోదీకి సూచించారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత రాందాస్ కదమ్ మాట్లాడుతూ.. ‘మనం ఒక సర్జికల్ దాడి చేశాక.. దాని కంటే పది రెట్లు ఎక్కువగా మన సైనికుల్ని పాకిస్తాన్ చంపింది. ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో ప్రధాని ఆలోచించాలి. ఎన్నికలపై కాదు.. సరిహద్దుల్లో భద్రతపై దృష్టి పెట్టాల’న్నారు.
తగినరీతిలో బుద్ధిచెపుతాం: వెంకయ్య
పాకిస్తాన్‌ను దుష్టదేశంగా కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. పాకిస్తాన్ చర్యలకు భారత్ తగిన రీతిలో బుద్ది చెబుతుందని పేర్కొన్నారు. ‘మేం చాలా దృఢనిశ్చయంతో ఉన్నాం. సాధ్యమైనదంతా చేస్తాం. ప్రభుత్వం ఆ పనిలోనే ఉంది. దాని గురించి త్వరలో మీరు వింటారు’ అని విలేకరులతో పేర్కొన్నారు. కశ్మీర్ లోయతో పాటు, నియంత్రణ రేఖ వెంట పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా చర్చించారు.
అదును చూసి దెబ్బకొట్టాలి: ఆర్మీ
భారత సైనికుల హత్య అనంతర పరిణామాల్ని పాక్ ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత ఆర్మీ వైస్ చీఫ్ శరత్‌చంద్ పేర్కొన్నారు. అదును చూసి పాక్‌కు సమాధానం ఇవ్వాలన్నారు. ఆర్మీ తీసుకునే చర్యల్ని చెప్పదల్చుకోలేదని, మాటలకు బదులు ఎప్పుడు ఎలా బదులివ్వాలన్న దానిపై దృష్టిపెట్టాలని చెప్పారు. ‘పాక్ సైన్యం మన భూభాగంలోకి వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటనకు వారు బాధ్యత వహించడంతోపాటు.. పరిణామాల్ని ఎదుర్కోవాలి’ అని శరత్‌చంద్ చెప్పారు. భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది.
ఆర్మీకి స్వేచ్ఛనివ్వండి: ఆంటోనీ
జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు సైనికుల హత్యపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. జాతీయ భద్రతపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి విధానం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ‘మన దేశ సరిహద్దుల్లో ఇద్దరు సైనికుల్ని పాకిస్తాన్ హత్య చేస్తే... ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల గెలుపు సంబరాల కోసం విజయ్ పర్వ్‌ను బీజేపీ నిర్వహించడం సిగ్గుచేటు. ప్రభుత్వం తొడుక్కున్న గాజులను తీసేసి ఏదొ ఒకటి చేయాలి’ అని కాంగ్రెస్ ప్రతినిధి కపిల్ సిబల్ ధ్వజమెత్తారు.
యూపీఏ హయాంలో భారత సైనికుల తలల్ని పాక్ ఆర్మీ నరికినప్పుడు.. నాటి ప్రధాని మన్మోహన్‌కు గాజులు పంపుతానని సుష్మా స్వరాజ్ చెప్పిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ శాఖకు పూర్తి స్థాయి మంత్రి ఉంటే సీమాంతర ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు ఒక విధానాన్ని ఖరారు చేయవచ్చన్నారు. పాకిస్తాన్‌పై సరైన చర్య చేపట్టేందుకు ఆర్మీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ సూచించారు. యూపీఏ హయాంలో ఇలాంటి సంఘటన ఒక్కటే జరిగిందని, అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు సైనికుల తలలు నరికిన సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు.