![Bill Gates Says Coronavirus Is Once In A Century Pathogen - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/29/Bill-Gates.jpg.webp?itok=9Abwx5ZG)
చికాగో : ప్రపంచదేశాలను వణికిస్తున్న కొవిడ్-19 శతాబ్ధంలో ఒకసారి వచ్చే అత్యంత తీవ్రమైన వ్యాధికారిక వైరస్ అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ' పేద, మధ్య తరగతి దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే అలాంటి దేశాలపై కరోనా లాంటి వైరస్‌లు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అందుకే ఆయా దేశాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపన్న దేశాలు సహకారం అందించాలి. ఇందుకోసం ప్రపంచదేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలి. మందులు, వ్యాక్సిన్లపై మరింత ఖర్చు పెట్టాలి. అప్పుడే వైరస్‌లను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడగలం' అని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఎడిటోరియల్‌లో బిల్‌గేట్స్ తెలిపారు. (టెక్ దిగ్గజాలకు కోవిడ్-19 సెగ)
కాగా కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తన వంతు సాయం కింద బిల్‌గేట్స్... మిలిందా అండ్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం ప్రకటించారు. కోవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఒకవైపు చైనాలో కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ ఉంటే, బాధిత దేశాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ వైరస్ న్యూజిలాండ్, లిథువేనియాలకు సోకింది. ఇప్పటివరకు 57 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించి వణుకు పుట్టిస్తోంది. చైనా ప్రభుత్వ లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 44 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 2,780 దాటింది. ప్రపంచవ్యాప్తంగా 83 వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. కోవిడ్ బారిన పడిన దేశాల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో భారత్ అప్రమత్తమైంది.
(బిల్‌గేట్స్ ముచ్చట ఖరీదు రూ. 4600కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment