వారసుడొచ్చాడు.. ప్రపంచదేశాల గుండెల్లో రైళ్లు!
న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచదేశాలను గడగడలాడించిన అల్‌ఖైదా ఉగ్ర సంస్ధకు వారసుడొచ్చాడా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వివిధ ఉగ్రసంస్ధల సహచర్యంతో తిరుగులేని శక్తిగా ఎదగడానికి అల్‌ఖైదా యత్నిస్తున్నట్లు కూడా సమాచారం. అల్‌ఖైదా వ్యవస్ధాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు 28 ఏళ్ల హమ్జా బిన్ లాడెన్ సంస్ధ పగ్గాలు చేపట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ పీడను వదిలించుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్న ప్రపంచరాజ్యాలు.. కొత్తగా ఊపిరులూదుకుని ఓ శక్తిగా వస్తున్న అల్‌ఖైదాను ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచిస్తున్నాయి.
ఇందుకోసం హమ్జా కదలికలపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఒసామా బిన్ లాడెన్ మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వ్యక్తి. దీంతో ఒసామా కొడుకు హమ్జా పిలుపునిస్తే వేలాదిగా ముస్లిం యువత సంస్ధలో చేరి ప్రాణత్యాగానికి సిద్ధపడతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచదేశాల్లో మరింత భయం పెరుగుతోంది. గడిచిన రెండు సంవత్సరాల్లో యూరప్ ఖండంలో అత్యధిక సార్లు ఉగ్రదాడులు జరిగాయి. అల్‌ఖైదా పునరుజ్జీవనం పోసుకుంటుందనే వార్త ఆ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.
అల్‌ఖైదాకు చెందిన పలువురు అగ్ర నాయకులు కూడా గతంలో హమ్జానే వారసుడని తీర్మానించారు. రెండేళ్ల క్రితమే అతన్ని ‘గుహ నుంచి వచ్చిన సింహం’ అని అల్‌ఖైదా కీలక నేత అల్ జవహరి అభివర్ణించాడు. ఒసామాకు ఉన్న 20 మంది సంతానంలో హమ్జా 15వ వాడు. మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు. ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం.
సౌదీ అరేబియాకు చెందిన ఆమె మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో హమ్జా తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. మొదట సౌదీ అరేబియా, సుడాన్, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌లలో కూడా నివసించాడు. హమ్జాకు కూడా వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే, హమ్జా ఎదిగిన తర్వాతి ఫోటో ఇంతవరకూ బయటకు రాలేదు. కేవలం అతని చిన్ననాటి ఫోటోనే నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
హమ్జాను అల్‌ఖైదా కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు భావించేవారు. అయితే తాను దూరంగా ఎందుకుండాలంటూ హమ్జా వారితో వాదించేవాడట. అమెరికాలో దాడులు అనంతరం ఒసామా బిన్ లాడెన్, ఇతర అనుచరులు తూర్పు అఫ్ఘానిస్థాన్‌లోని తోరాబోరా కొండల్లో దాక్కున్నారు. అప్పుడే ఒసామా తన భార్యాపిల్లలను ఇరాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు పంపించి వేశాడు. అనంతరం హమ్జా తండ్రిని పెద్దగా కలిసింది లేదు. ఇరాన్‌లో దాదాపుగా గృహ నిర్బంధంలో ఉన్నట్టుగా ఉండేవాడు. దీనిపై అసంతృప్తి చెందుతూ పవిత్ర సైనికుని(మొజాహిదీన్)గా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 2009లో తండ్రికి పెద్ద ఉత్తరం రాశాడు హమ్జా. ఉగ్ర పోరాటాలతో సాధ్యమైనన్ని మార్గాల్లో ఆయా దేశాలకు నష్టం కలిగించాలని అనుచరులకు హమ్జా చెబుతున్నట్టు తెలిసింది.