టీవీ రిమోట్‌పై ఆధిపత్యం ఎవరిది?
టీవీ రిమోట్‌పై ఆధిపత్యం ఎవరిది? దీనికి సమాధానం దశాబ్దాలుగా తేలనేలేదు.. నాకా సీరియల్ కావాలి.. నేనీ మ్యాచ్ చూడాలి అంటూ కుటుంబాల్లో పోరాటం కొనసాగుతునే ఉంది.. సందట్లో సడేమియాలా ఇప్పుడో కొత్త పోటీదారు వచ్చింది.. భార్యా, భర్త, పిల్లల పోరాటం మధ్య కుక్క కూడా వచ్చి చేరింది.. నేనా డిస్కవరీ చానల్ చూడాలి అంటూ గయ్యిమంటోంది.. పైగా.. దీని కోసం ప్రత్యేకంగా ఇప్పుడు కొత్త రిమోట్ కూడా వచ్చేసింది.. అంటే.. మనతో సంబంధం లేకుండా దానికిష్టం వచ్చినట్లు చానల్స్ మార్చేస్తుందన్నమాట. బ్రిటన్‌కు చెందిన ప్రొఫెసర్ డగ్లస్, వాగ్ అనే పెట్ కంపెనీ కలిసి దీన్ని తయారుచేశాయి. కాళ్లతో నొక్కేటట్లుగా రూపొందించారు. వైర్లు వంటివాటిని కుక్కలు నమిలేయకుండా ఉండటానికి ఇందులో మందంగా ప్లాస్టిక్ కోటింగ్ వేశారు.
ఇంట్లో కుక్కలను ఒంటరిగా వదిలివెళ్లినప్పుడు వాటికి ఉద్దేశించిన చానళ్లను అవి చూడటానికి ఈ రిమోట్ ఉపయోగపడుతుందని డగ్లస్ చెబుతున్నారు. ఇప్పటికే కుక్కలకు దీన్ని ఇచ్చి.. వాడేలా చూశారు.. సానుకూల ఫలితాలు వ చ్చాయట. ఇటీవల బ్రిటన్‌లో జరిపిన ఓ సర్వేలో కుక్కలు తమతోపాటు సోఫాలో కూర్చుని టీవీ చూస్తాయని 91 శాతం మంది చెప్పారు. ప్రతి కుక్క రోజులో సగటున ఒక గంట 20 నిమిషాల సమయాన్ని టీవీ చూడటానికి వెచ్చిస్తుందట. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ రిమోట్ ధర రూ.4500.