మార్కెట్‌లోకి హైడ్రోజన్ కారు ‘రస’
లండన్: ఆధునిక హంగులతో బ్రిటిన్ హైడ్రోజన్ కారు ‘రస’ బుధవారం నాడు రోడ్డు మీదకు వచ్చింది. రెండు సీట్ల ఈ కారులో గేర్లు ఉండవు. ముందుకు, వెనక్కి వెళ్లడానికి, న్యూట్రల్ చేయడానికి ఎగువ భాగాన బటన్లు ఉంటాయి. కాళ్ల కింద యాక్సిలేటర్, బ్రేక్‌లు ఉంటాయి. కిలోన్నర హైడ్రోజన్ ఇంధనంపై 482 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంది. పది సెకడ్లలో గంటకు 97 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. ఇరువైపుల డోర్లు పై భాగానికి, అంటే ఆకాశానికి తెరచుకుంటాయి.
సీఎన్‌జీ కంటే కూడా అతి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. వేగంగా పోతున్నప్పుడు నీటి ఆవిరి మాత్రమే బయటకు వెలువడి గాలిలో కలసిపోతుంది. మెల్లగా వెళుతున్నప్పుడు నీటి చుక్కలు మాత్రమే నేల రాలుతాయి. అందుకనే దీనికి లాటిన్ పదం ‘రస’ అని పేరు పెట్టారు. రస అంటే లాటిన్‌లో స్వచ్ఛమైన అని అర్థం. హైడ్రోజన్ ఇంధనం ప్రమాదకరమైనప్పటికీ పెట్రోలు, డీజిల్ కార్ల కన్నా ఈ కార్లే సురక్షితమైనవని కారు ఉత్పత్తిదారులు చెబుతున్నారు. పెట్రోలు లేదా డీజిల్ కార్లు ప్రమాదానికి గురైనప్పుడు వాహనం కిందకు ఆయిల్ లీకవుతుందని, అదే తమ హైడ్రోజన్ కారు ప్రమాదానికి గురైనప్పుడు హైడ్రోజన్ గ్యాస్ గాలిలో కలసిపోతుందని అంటున్నారు.
కేవలం 580 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ కారు బాడీని పటిష్టమైన మెటీరియల్‌తో తయారు చేశామని వేల్స్‌లోని ‘రివర్ సింపిల్ మూవ్‌మెంట్’ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీ ఇంజనీర్లే ఈ కారును రూపొందించారు. మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు, బీమా అన్నింటిని వినియోగదారుడికి ఉచితంగానే ఇస్తామని, కారు ధర ఫోక్స్‌వాగన్ గల్ఫ్ కారు రేటు ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అన్నీ బాగున్నా బ్రిటన్‌లో హైడ్రోజన్ ఇంధనం నింపుకోవడమే కష్టం. ఎందుకంటే బ్రిటన్‌లో ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనం దొరికే బంకులు కేవలం 14 మాత్రమే ఉన్నాయి. త్వరలోనే మరో 12 బంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది.