బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టు సీసీటీవీ ఫుటేజిలో లభించిన పేలుళ్ల అనుమానితుల చిత్రాలు
- ముగ్గురు అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన బెల్జియం పోలీసులు
- మార్చి 30న బ్రసెల్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ/ బ్రస్సెల్స్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమిగా పేరుపొందిన నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) దళాలకు ప్రధాన స్థావరమైన బ్రసెల్స్(బెల్జియం) నగరంలో విధ్వంసం సృష్టించంచి ప్రపంచానికి పెను సవాలును విసిరింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ. నాటో ప్రధాన స్థావరంగానేకాక యురోపియన్ యూనియన్(ఈయూ) కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా ఉన్న బ్రసెల్స్ ను వ్యూహాత్మకంగానే టార్గెట్ గా చేసుకున్న ఐఎస్.. తన ప్లాన్ ను పక్కాగా అమలు చేసేందుకు సుశిక్షితులైన సభ్యుల్ని వినియోగించింది.
ఎయిర్ పోర్టు సహా మెట్రో స్టేషన్ వద్ద బాంబులు అమర్చినట్లుగా అనుమానిస్తున్న ముగ్గురి ఫొటోలను బెల్జియం పోలీసులు మంగళవారం రాత్రి విడుదల చేశారు. నల్ల చొక్కాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు, వారి పక్కనే నడుస్తున్న మరో టోపీవాలాల కదిలికలను సీసీటీవీ ఫుటేజీల నుంచి సేకరించిన పోలీసులు.. ఆ ముగ్గురే బాంబులు అమర్చినవారై ఉంటారని అనుమానిస్తున్నారు.
సాధారణ ప్రయాణికుల మాదిరిగా ట్రాలీలో లగేజ్ ను నెట్టుకుంటూ వెళ్లిన వారు.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఎయిర్ పోర్టులోకి పేలుడు పదార్థాలను ఎలా తీసుకెళ్లారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వీరి ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లతోపాటు పొరుగుదేశాలకు సైతం పంపిన బెల్జియం పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) బ్రసెల్స్ ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్ల వద్ద చోటుచేసుకున్న మూడు పేలుళ్లలో 34 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
30న బ్రసెల్స్ కు భారత ప్రధాని మోదీ
ఇదిలా ఉండగా, ఈయూ- ఇండియా సదస్సులో పాల్గొనేందుకు మార్చి 30న భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రసెల్స్ వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్నపరిణామాలు అధికారులను కలవరపాటుకు గురిచేశాయి. అయితే బెల్జియం, ఈయూ ప్రతినిధులతో సంవాదాల అనంతరం మోదీ బ్రసెల్స్ పర్యటన యథావిథిగా కొనసాగుతుందని విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.