
నీటిలో బుల్లెట్ దిగదు...!
గురిచూసి టార్గెట్ చేస్తే బుల్లెట్ గాలిని చీల్చుకుంటూ వెళ్లి దిగిపోతుంది. మరి నీటి లోపల ఏం జరుగుతుంది? బుల్లెట్ తుస్సుమంటుంది. బ్రిటన్‌కు చెందిన ఫిజిక్స్ నిపుణుడు అండ్రియాస్ వాల్ ఇదే విషయాన్ని జనాన్ని పోగేసి మరీ నిరూపించాడు. అంతేనా దీన్ని వీడియో తీసి యూ ట్యూబ్‌లో పెట్టాడు. ఓ స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఇతను స్టాండ్‌పై రైఫిల్‌ను అమర్చాడు. దాని ట్రిగర్‌కు తాడును కట్టి దాన్ని తనకు అందేలా చూసుకున్నాడు. కౌంట్‌డౌన్ మొదలైంది. అండ్రియాస్ తాడుతో ట్రిగర్‌కు లాగాడు.
తుపాకీ పేలిన శబ్దం బయట ఉన్నవారికి స్పష్టంగా వినపడింది. అందరిలోనూ ఉత్కంఠ. కొద్ది క్షణాల తర్వాత అండ్రియాస్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన బుల్లెట్‌ను వెతికి ఓ చేతిలో పట్టుకొని పైకి తేలాడు. విషయమేమిటంటే గాలి కంటే నీరు 800 రెట్లు మందంగా ఉంటుందట. నీటిలో తుపాకీని పేలిస్తే బుల్లెట్ రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు. బుల్లెట్ పేలగానే ముందుభాగంలో అధిక పీడనం, వెనకవైపు అల్పపీడనం ఏర్పడతాయట. వీటికారణంగా బుల్లెట్ వేగం క్షణంలో తగ్గిపోతుంది. రెండు మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేదు.