నీటిపై పెరటి తోటలు | bushes on water | Sakshi
Sakshi News home page

నీటిపై పెరటి తోటలు

Published Thu, Apr 27 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

నీటిపై పెరటి తోటలు

నీటిపై పెరటి తోటలు

బియ్యం మొదలుకొని ఉప్పు పప్పు అన్నింటి ధరలు ఇప్పటికే మండిపోతున్నాయి. ఇంకొన్నేళ్లు పోతే ప్రపంచ జనాభా ఏకంగా వెయ్యి కోట్లకు చేరుకుంటుంది. అప్పుడు గంపల్లో డబ్బు మోసుకెళ్లి సంచుల్లో కాయగూరలు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. మరి ఏమిటి తరుణోపాయం? భూమ్మీద 70 శాతం వరకూ ఉన్న సముద్రాలను వాడుకోవడమే అంటోంది స్పెయిన్‌లోని ఫార్వార్డ్‌ థింకింగ్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ. అదెలా? సముద్రంలో జలచరాలు మినహా మరేవీ పండవు కదా అంటున్నారా? నిజమేగానీ.. నీటిపై ఫొటోలో చూపినట్టు భారీసైజులో తేలియాడే కట్టడాలు ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాల పంటలూ పండించుకోవచ్చునని అంటోంది ఈ సంస్థ. ‘స్మార్ట్‌ ఫ్లోటింగ్‌ ఫార్మ్‌’ అని పిలిచే ఈ తేలియాడే కట్టడాలు మూడు అంతస్తులుగా విడిపోయి ఉంటాయి. పైకప్పు మొత్తం సోలార్‌ ప్యానెల్స్‌తో నిండి ఉంటుంది. దీంతోపాటు వాననీటిని ఒడిసిపట్టేందుకు, అవసరమైనప్పుడు కాంతిని ప్రసారం చేసేందుకూ ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి.



ఇక రెండో అంతస్తుకు దిగివస్తే.. ఇక్కడ నేల అవసరమన్నది లేకుండా హైడ్రోపానిక్స్‌ పద్ధతిలో పంటలు పండించే గ్రీన్‌హౌస్‌లు ఉంటాయి. ఇక మిగిలిన ఒక అంతస్తులో చేపలు, ఇతర సముద్రజీవులను కృత్రిమ కొలనుల్లో పెంచుతారు. చేపల వ్యర్థాలు, ఇతర పోషకాలను పంటలకు ఎరువుగా ఉపయోగించేందుకు అవకాశముంటుంది. ఒక్కో స్మార్ట్‌ ఫ్లోటింగ్‌ ఫార్మ్‌ ద్వారా ఏడాదికి దాదాపు 8 వేల టన్నుల కాయగూరలు, 1,703 టన్నుల మత్స్య ఉత్పత్తులు సాగుచేయవచ్చునని, అవసరాన్ని బట్టి ఫార్మ్‌ సైజును పెంచుకునే అవకాశం ఉండటం వల్ల ఆహార కొరతన్నది రాదని అంచనా. ముంబై, న్యూయార్క్, లాస్‌ఏంజెలిస్, టోక్యో, జకార్తా వంటి సముద్రతీర మహా నగరాల్లో ఇలాంటి ఫార్మ్‌లను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసుకోవడం వల్ల తక్కువ ధరకే (పల్లె నుంచి, ఇతర దేశాల నుంచి చేసుకునే దిగుమతులు తగ్గి) కాయగూరలు, పండ్లూ లభిస్తాయి. ఐడియా బాగానే ఉందిగానీ.. ఒక్కో ఫార్మ్‌ ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది? పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది అనే అంశాలపై కంపెనీ వేస్తున్న లెక్కలు పూర్తవడానికి ఇంకొంచెం టైమ్‌ పట్టేలా ఉంది.

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement