ఎలుకల కోసం బోను
మనం ఇంతవరకూ ఎలుకలను పట్టుకునేందుకు ఉపయోగపడే ఎలుకల బోనులనే చూశాం. కానీ ఈ బోను ఎలుకలను పట్టుకునేందుకు కాదు.. అవి నివసించేందుకు! భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో వ్యోమగాములతో పాటు నివసించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 10 ఎలుకలను వచ్చే ఆగస్టులో అక్కడికి పంపనుంది. అందుకే అవి ఐఎస్‌ఎస్‌కు సురక్షితంగా చేరడంతోపాటు అక్కడ నివసించేందుకూ ఉపయోగపడేలా ఈ హైటెక్ బోనును కాలిఫోర్నియాలోని నాసా ఏఎంఈఎస్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఎలుకలకు కావలసిన ఆహారం, నీరు, తాజా గాలి వంటి వన్నీ ఇందులో ఉంచుతారు. వాటిని పర్యవేక్షించేందుకు విజువల్/ఇన్‌ఫ్రారెడ్ వీడియో సిస్టమ్ ఈ బోనులో ఉంది. అయితే వీటిని ఏదో సరదా కోసం అక్కడికి పంపడం లేదు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేమి వల్ల వ్యోమగాములు కండరాల ద్రవ్యరాశి తగ్గిపోవడం, ఎముకలు, ప్రత్యుత్పత్తి, వ్యాధినిరోధక వ్యవస్థలు బలహీనపడిపోవడం, గుండె, నాడీ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. జీరో గ్రావిటీలో ఎలుకలను ఉంచి, వాటి శరీరంలో ఆరోగ్యపరంగా వచ్చే మార్పులను, ఆయా సమస్యల నివారణకు పరిష్కారాలను కనుగొనేందుకే నాసా వీటిని రోద సికి పంపుతోందన్నమాట.