అద్భుత కార్టూన్ వైరల్‌‌: ఉద్యోగం పోయింది | Canadian cartoonist loses job after viral Trump illustration | Sakshi
Sakshi News home page

అద్భుత కార్టూన్ వైరల్‌‌: ఉద్యోగం పోయింది

Published Mon, Jul 1 2019 6:00 PM | Last Updated on Mon, Jul 1 2019 6:35 PM

Canadian cartoonist loses job after viral Trump illustration - Sakshi

ఆయన వేసిన కార్టూన్‌  చూసి అందరూ ఆశ్చర్య పోయారు. అద్బుతం, అమోఘం అంటూ ప్రశంసలు కురిపించారు.  ప్రఖ్యాత అంతర్జాతీయ  అవార్డు పులిట్జర్ బహుమతికి యోగ్యమైందంటూ పలువురు సెలబ్రిటీలు, ఇతర రాజకీయ విమర్శకులు పొగడ్తల్లో ముంచెత్తారు. కానీ ఆ పొలిటికల్‌ కార్టూనిస్ట్‌ మాత్రం ఉద్యోగాన్ని కోల్పోయారు.  ఇంతకీ ప్రచురణ సంస్థ ఆగ్రహానికి ఎందుకు గురయ్యారు? ఆయన ఉద్యోగానికి  చేటు తెచ్చిన  ఆ కార్టూన్‌ ఏంటి? 
 
వలసదారుల అవస్థలపై  స్పందించిన కెనడియన్ కార్టూనిస్ట్ మైఖేల్ డి ఆడెర్  ఒక  కార్టూన్‌ను ప్రచురించారు.  అదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను విమర్శిస్తూ ఈ చిత్రాన్ని గీసినందుకు  తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ఇటీవల ఎల్ సాల్వడార్ నుంచి  మెక్సికో ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి   ప్రయత్నించిన తండ్రీ బిడ్డలు (ఆస్కార్ అల్బెర్టో మార్టినెజ్ రామిరేజ్, అతని 23 నెలల కుమార్తె వాలెరియా) ప్రాణాలు  పోగొట్టుకున్నసంగతి తెలిసిందే.  వీరి మృతదేహాల ఫోటో ప్రపంచవ్యాప్తంగా  వైరల్‌ అయింది. దీంతో స్పందించిన ఆడెర్‌ సరిహద్దు వివాదాలపై వ్యంగ్యంగా  వలసదారుల మృతదేహాలపై  ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్నట్లుగా కార్టూన్‌ వేశారు.  ఇది  న్యూ బ్రూన్స్‌విక్‌లోని ఒక ప్రచురణ సంస్థలో ప్రచురితమైంది. ఇది కెనడా, అమెరికా వ్యాప్తంగా పలువురి మనసులను గెల్చుకుంది. కానీ అతని ఉద్యోగం మాత్రం ప్రమాదంలో పడిపోయింది.  తనను ఉద్యోగంనుంచి తొలగించారని ఆడెన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో పలువురు కార్టూనిస్టులు ఇతర ప్రముఖులు  ఆడెర్‌కు మద్దతుగా నిలిచారు.

అయితే ట్రంప్‌పై  కార్టూన్‌ సోషల్ మీడియాలో వైరల్ అయిన 24 గంటల తరువాత ఆడెర్‌ను తొలగించారని కెనడియన్ కార్టూనిస్టుల సంఘం అధ్యక్షుడు వెస్ టైరెల్ ఆరోపించారు.  17 సంవత్సరాల పాటు అతను సంస్థకు సేవలందించిన అతని తొలగింపునకు ఎటువంటి కారణం లేదని పేర్కొన్నప్పటికీ ఇది  యాదృచ్చికంగా జరిగింది కాదని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో కమెంట్‌ చేశారు.  అటు తన కాంట్రాక్ట్‌ ఇంకా పూర్తి కాలేదనీ, సాంకేతికంగా తనను తొలగించే అధికారం బ్రూన్స్‌విక్‌ పత్రికకు లేదని ఆడెర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 

ట్రంప్ కార్టూన్ విషయంలో ఆడెర్‌తో ఫ్రీలాన్స్ ఒప్పందాన్ని రద్దు చేసిందన్న వాదన పూర్తిగా తప్పు అని.. అనవసరంగా సోషల్‌ మీడియాలో ఇది వైరలైంది  అని బ్రూన్స్‌విక్‌ న్యూస్ ఇంక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. అసలు ఆడెర్‌ ట్రంప్‌ కార్టూన్‌  తమకు ఇవ్వలేదంది. తాము  ఇప్పటికే  మరో కార్టూనిస్ట్‌ను నియమించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. గత కొన్ని వారాలుగా దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement