కారు.. త్రీడీలో..
ఈ మధ్య త్రీడీ ప్రింటింగ్ ఎక్కువైపోయింది. అన్ని రకాల వస్తువులనూ త్రీడీ ప్రింటింగ్ చేసేస్తున్నారు. ఇదిగో చిత్రంలోని కారు కూడా అలా చేసిందే! దీన్ని 44 గంటల్లో కేవలం 40 భాగాలతో తీర్చిదిద్దారు. పేరు స్ట్రాటీ. కార్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. బ్యాటరీ ఆధారంగా నడుస్తుంది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అమెరికాలోని అరిజోనాకు చెందిన లోకల్ మోటార్స్ దీన్ని తయారుచేసింది. ఇందుకోసం భారీ త్రీడీ ప్రింటర్‌ను వాడారట.
ఈ కారు చాసిస్, బాడీ, సీట్లను త్రీడీ ప్రింటర్ సాయంతోనే ముద్రించారు. అయితే.. టైర్లు, బ్యాటరీ, వైరింగ్, సస్పెన్షన్ , ఎలక్ట్రిక్ మోటారు, అద్దాలు మాత్రం మామూలువే వాడారు. స్ట్రాటీలో ఇద్దరు ప్రయాణించొచ్చు. త్వరలో దీన్ని మార్కెట్లోకి తెస్తామని, ధర రూ.10 లక్షలకు పైగా ఉండొచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.