శభాష్‌ కరేబియన్‌ | Caribbean Islands goal is a corruption free society | Sakshi
Sakshi News home page

శభాష్‌ కరేబియన్‌

Published Sun, Jan 5 2020 2:24 AM | Last Updated on Sun, Jan 5 2020 2:24 AM

Caribbean Islands goal is a corruption free society - Sakshi

కరేబియన్‌.. చిన్న చిన్న ద్వీపకల్పాలతో కూడిన దేశాల సమాహారం. చుట్టూ సముద్రం. తమదైన సంస్కృతీ సంప్రదాయాలను కలిగిన వివిధ దేశాలతో కూడిన దీవులను కరేబియన్‌ దీవులని పిలుస్తారు. నార్త్‌ అమెరికా, సౌత్‌ అమెరికా మధ్యనున్న ఈ దీవుల్లో జరుగుతోన్న సంస్కరణలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముందు విద్యాభివృద్ధిని సాధించాలి. శతాబ్దాల నాటి కాలం చెల్లిన విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, కాలంతో పాటు మారుతూ, సమాజం నిత్యనూతనంగా విరాజిల్లాలంటే ప్రజలందరికీ సమానమైన విద్యావకాశాలు అందుబాటులో ఉండాలి. సరిగ్గా ఇలాంటి అభివృద్ధి నమూనానే అనుసరిస్తూ ప్రపంచ ప్రజల మెప్పు పొందుతోంది ఈ కరేబియన్‌ రీజియన్‌. ఈ సంస్కరణలకు మూల కారకురాలైన బార్బడోస్‌ ప్రధానమంత్రి మియామోట్లీ వైవిధ్యభరితమైన విద్యావిధానానికి రూపకల్పన చేసి అందరి మన్ననలు అందుకుంటున్నారు. మూడు ప్రధాన అంశాలపై ఆమె దృష్టి సారించారు.

విద్యకు పునర్నిర్వచనం..
1879 నాటి విద్యా విధానాన్నే ఇప్పటికీ అనుసరిస్తోన్న ఈ రీజియన్‌లో సెకండరీ స్కూల్‌ ఎంట్రన్స్‌ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన విద్యార్థులకు మాత్రమే మంచి నాణ్యత కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశం ఉంటుంది. మిగిలిన వారికి నాణ్యమైన విద్య అందుబాటులో ఉండదు. అరకొర పాఠశాలల్లోనే వారు చదువుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంలోని లోపాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మియామోట్లీ దేశంలోని అన్ని పాఠశాలలనూ ఒకేరీతిన అభివృద్ధిపరిచారు. ఎంట్రన్స్‌ విధానాన్ని రద్దుచేసి, పాఠశాలలన్నింటినీ టాప్‌ స్కూల్స్‌గా మారుస్తూ సంస్కరణలు చేపట్టారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులను ప్రవేశపెట్టారు. వివిధ కళల్లో శిక్షణనిచ్చే ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేకమైన వసతులు కల్పించారు. చుట్టుపక్కల దేశాలు సైతం ఈ ఎంట్రన్స్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయి. 

అవినీతి రహితమే ప్రభుత్వ హితం
సామాజిక అభివృద్ధికి అడ్డంకిగా మారిన అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా బార్బడోస్‌ ప్రధాని మియామోట్లీ పనిచేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందకపోవడానికీ, నేరాల రేటు పెరగడానికీ అవినీతి కారణమవుతోంది. హైతీ దీవిలో స్థానిక ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాధనం వృథా కావడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి వేళ్లూనుకోవడంతో ప్రజా ఉద్యమాలు పెల్లుబికాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మియామోట్లీ ప్రభుత్వం అవినీతిరహిత సమాజం కోసం కృషి చేస్తోంది. 

మూలవాసులకు గౌరవం
స్థానిక ప్రజల సాంస్కృతిక వారసత్వ హక్కులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందీ దేశం. 500 ఏళ్లలో తొలిసారి 2019లో జమైకాకి తైనో చీఫ్‌ని నియమించారు. నెల క్రితం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జమైకా మూలవాసులు ‘తైనో డే’ నిర్వహించుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తైనో చెక్క కళాఖండాలను బ్రిటన్‌ నుంచి తిరిగి పొందేందుకు జమైకా ప్రభుత్వం జాతీయ కమిషన్‌ ద్వారా కృషి చేస్తున్నట్టు సాంస్కృతిక, లింగ, వినోద, క్రీడా రంగాల మంత్రి ఒలివియా గ్రాంజ్‌ వెల్లడించారు. మొత్తంగా ఆదివాసీల సంస్కృతినీ, వారి ఆకాంక్షలనూ గుర్తించి, గౌరవించే ప్రక్రియలో ఈ ప్రభుత్వం విజయపథంలో నడుస్తోంది. ఏ దేశమైనా తన మూలాలను అర్థం చేసుకోకుండా, తన స్వీయ చరిత్రను అవగాహన చేసుకోకుండా ముందుకెళ్లలేవు. తమ మూలాలను గ్రహించి, వాటిని గౌరవించుకుంటూ కరేబియన్‌ దేశం నూతన దశాబ్దంలోకి అడుగిడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement