
పోయిన పిల్లి దొరికిందోచ్!
అలస్కా: విడిపోయిన ఆ కుటుంబం రెండు నెలల తరువాత కలుసుకుంది. తప్పిపోయింది ఎవరో చిన్నారి కాదు. రెండేళ్ల వయసున్న పిల్లి! విషయమేంటంటే... కింబర్లీ చెల్ఫ్, జెస్సీ చెల్ఫ్ దంపతులు టెక్సాస్‌లోని ఎల్‌పాసో నగరంలో నివసిస్తున్నారు. వీరు అల్లారుముద్దుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దాని పేరు మూసీ. కన్నబిడ్డ కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. జెస్సీ చెల్ఫ్ సైన్యంలో పనిచేస్తున్నారు. ఆయనకు అలస్కాలోని ఫెయిర్‌బ్యాంకుకు బదిలీ అయింది. దీంతో ఆయన టెక్సాస్ ను వదలాల్సి వచ్చింది. ఇందుకోసం ఆ ప్యాకర్స్ సంస్థను ఆశ్రయించాడు.
వారు వచ్చి ఇంటి సామానును ప్యాక్ చేసి తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి మూసీ కనిపించ లేదు. ఇళ్లంతా గాలించినా దొరకలేదు. ఇంటి సామగ్రిని పంపించేసి దంపతులిద్దరూ టెక్సాస్ మొత్తం మూడురోజులపాటు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. చేసేది లేక మూసీ లేకుండానే దంపతులు అలస్కాకు బయల్దేరారు. దాదాపు 64 రోజుల తరువాత వారి సామగ్రి కొత్త ఇంటికి డెలివరీ అయింది. వాటిలో పరుపును విప్పి చూడగా అందులో తిండితిప్పలు లేక శుష్కించిన మూసీ కనిపించింది. అదింకా ప్రాణాలతోనే ఉంది.
దీంతో కింబర్లీకి ప్రాణం లేచివచ్చినట్లయింది. దాన్ని వెంటనే వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మూసీకి ప్రాణాపాయం తప్పి కోలుకొంటోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలతోపాటు, కెనడా దేశాలను మొత్తం చుట్టి 64 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత మూసీ ఎట్టకేలకు ఇంటికి చేరింది. మూసీ తిరిగిరావడంతో చెల్ఫ్ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.