ఆ రేపిస్టులను శిక్షపడాలి..
పారిస్: జౌహౌరా 16 ఏళ్ల అమ్మాయి. మధ్య ఆఫ్రికాలోని ఛాడ దేశస్థురాలు. మాతృదేశంలోనే ఆమెకు ఘోరం జరిగిపోయింది. ముగ్గురు జనరల్స్ కుమారులు, విదేశాంగ మంత్రి మౌసా ఫకీ మహమత్ కుమారుడు సహా ఐదుగురు కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘోరాన్ని ఆమె తనలోనే దాచుకొని కుమిలిపోకుండా ధైర్యంగా సమాజం ముందుకు వచ్చింది. తన పేరును, గుర్తింపును స్వచ్ఛందంగా బయటపెట్టింది. నేరస్థులను శిక్షించేందుకు పోరాటం మొదలు పెట్టింది. తనకే కాకుండా కామాంధుల చేతుల్లో బలవుతున్న తనలాంటి ఎందరో మహిళలను న్యాయం జరగాలని కోరుకుంటోంది.
జౌహౌరా ఛాడ దేశ రాజధాని ఉంజుమేను నగరంలో చదువుకుంటోంది. గత ఫిబ్రవరి 8వ తేదీన రోజులాగానే తన స్నేహితురాలితో కలసి ఇంటికి వెళుతుండగా, కారులో వచ్చిన సంపన్న వర్గానికి చెందిన ఐదుగురు యువకులు ఆమెను మెడపట్టి కారులోకి లాక్కున్నారు. అనంతరం నగర శివారులోకి తీసుకెళ్లి నిర్జీవ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటనపై అంతకు ముందెన్నడూ లేనివిధంగా ఛాడ దేశం భగ్గుమంది. వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రదర్శనలు అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ప్రజా ప్రదర్శనల ఒత్తిడి కారణంగా నిందితులను అరెస్ట్ చేశారు.
ఈలోగా జౌహౌరా ఫ్రాన్స్‌లోని బంధువుల ఇంటికి వచ్చింది. ఇక్కడి నుంచే ఆమె తన తదుపరి పోరాటాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కోసమే కాకుండా తన లాంటి బాధితుల కోసం తాను పోరాటాన్ని ప్రారంభించానని తెలిపింది. తన గురించిన పూర్తి వివరాలను వెల్లడించింది. ఫ్రెంచ్ టౌన్ నాన్సీలో నివసించే తన తండ్రి మద్దతుతోనే తాను పోరాటం చేస్తున్నానని చెప్పింది.
‘రేప్ సంఘటనను కుటుంబంలోనే పరిష్కరించుకుందామని మా నాన్న అంటారని భావించాను. అలా అనలేదు. న్యాయం జరిగే వరకు పోరాడమని చెప్పారు. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చాను. నా లాగా ఛాడ దేశంలో ఎంతోమంది అమ్మాయిలు రేప్‌లకు గురవుతున్నారు. వారెవరూ ఫిర్యాదు చేయరు. చేసినా ఎవరూ పట్టించుకోరు. వారికి న్యాయం జరగదు. నాపై గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత నేను కూడా పోలీసు వద్దకు వెళ్లాను. ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదు. దురుద్దేశంతో గొప్పవారిపై ఫిర్యాదు చేస్తున్నానని ఆరోపించారు.
ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా స్పందించారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారికి శిక్ష పడుతుందని నేను భావించడం లేదు. అక్కడి ప్రభుత్వం అలా ఉంది. నిందితులు ఇప్పుడు జైల్లో ఉన్నారని కూడా నేను అనుకోవడం లేదు. అయినా నా పోరాటాన్ని ఆపను. ప్రపంచవ్యాప్తంగా నాకు వస్తున్న మద్దతుతో ముందుకే సాగుతాను. నేరస్థులు గ్యాంగ్‌రేప్‌ను వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. వారిని శిక్షించేందుకు ఆ సాక్ష్యం చాలని నేను అనుకుంటున్నాను. నేరస్థులు ఊహించినట్లుగా సోషల్ మీడియా స్పందించలేదు. నాకే మద్దతుగా నిలిచింది. నా పోరాటానికి మద్దతిస్తున్నవారందరికి రుణపడి ఉంటా’ అని గద్గద స్వరంతో ఆమె మీడియాకు చెప్పింది.