ఈ బాలలు చేసిన పాపం ఏమిటి?
గ్వేయర్: 12 ఏళ్ల నజీర్ అదృష్టవంతుడు. బాంబుల జాకెట్ ధరించి అమాయక ప్రజల మధ్య ఆత్మాహుతి బాంబుగా పేలాల్సిన నజీర్ ఐసిస్ ఉగ్రవాదుల కబంధ హస్తాల నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. కుర్దిస్థాన్‌లోని ఎస్యాన్ శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరుకున్నాడు. పైశాచిక ఉగ్రవాదుల వద్ద బాల సైనికుడిగా శిక్షణ పొందుతూ అనుభవించిన క్షోభను, మౌనంగా ఏడ్చిన రాత్రుల గురించి పూసగుచ్చినట్టు మీడియాకు వివరించాడు. దయచేసి తన అసలు పేరునుగానీ, తల్లిదండ్రుల పేర్లనుగానీ వెల్లడించవద్దని, ఫొటో లేదా రికార్డు చేసిన తన గొంతునుగానీ విడుదల చేయరాదని మీడియాను వేడుకున్నాడు. ఆ వేడుకోలులో ఆందోళన, ఆవేదన ఉంది. మనకు తెలియని చీకటి కోణాలూ ఉన్నాయి. ఆ బాలుడితోపాటు మరో 15000 మంది యాజిదీలు ఐసిస్ కేంద్రాల నుంచి తప్పించుకున్నారు.
‘ఐసిస్ ఉగ్రవాదుల వద్ద సైనిక శిక్షణ పొందుతున్న 60 మంది బాలల్లో నేను ఒకడిని. బాంబులు కురిపిస్తూ పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలు వచ్చినప్పుడు మమ్మల్ని నేల మాళిగల్లోకి తీసుకెళ్లి దాచేవారు. అవి అల్లాను విశ్వసించని అమెరికాకు చెందిన విమానాలని, చంపడానికి వచ్చాయని చెప్పేవారు. వారి నుంచి రక్షించేందుకే తామున్నామని చెప్పేవారు. మా తల్లిదండ్రులకన్నా మమ్మల్ని బాగా చూసుకుంటామని నమ్మబలికేవారు. శిక్షణ ఇస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు అల్లాను విశ్వసించనివారని, శిక్షణ పూర్తికాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను హతమార్చాలని బోధించేవారు. ఉగ్రవాదులే మా కుటుంబమని చెప్పేవారు. మాలో అత్యంత పిన్న వయస్కుడు ఐదేళ్ల బాలుడు. మమ్మల్ని కాలిఫేట్ పిల్లలని పిలిచేవారు. తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడు మాకు ఏడుపొచ్చేది. కానీ ఏడ్వనిచ్చేవారు కాదు. తల్లిదండ్రులు నా గురించి ఎంత ఆందోళన పడుతున్నారోనని తల్లడిల్లేవాడిని. ఎవరూ లేనిది చూసి ఒంటరిగా నాలోనేనే ఏడ్చేవాడిని. ఇప్పుడు వారి నుంచి తప్పించుకొని తల్లి ఒడిని చేరుకోవడం నాకు నిజంగా పునర్జన్మే’ అని నజీర్ వ్యాఖ్యానించాడు.
సిరియాలోని రక్కాలో సైనిక దుస్తుల్లో ముఖానికి ముసుగులు ధరించిన బాలలకు శిక్షణ ఇస్తున్నట్టు ఐసిస్ విడుదల చేసిన ప్రచార వీడియోలోనూ నజీర్ ఉన్నాడు. ‘తో జిహాద్, తో జిహాద్’ అని బాలలు నినాదం చేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అల్లాను నమ్మని మనుషులకు వ్యతిరేకంగా జరిగే జిహాది యుద్ధంలో ఈ పిల్లలే అగ్రభాగాన నిలుస్తారంటూ ఐసిస్ శిక్షకుడు చేసిన కామెంట్ కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. ఐసిస్ ఉగ్రవాదుల నుంచి తప్పించుకొని తమ వద్దకు వచ్చినప్పుడు పిల్లలంతా కంకాళాల్లాగా కనిపించారని, నరకం నుంచి వచ్చామని వారు చెప్పడం కదిలించిందని వారిని రక్షించడానికి సహాయపడిన ప్రభుత్వ సైనిక కమాండర్ అజీజ్ అబ్దుల్లా హదూర్ మీడియాకు తెలిపారు. తమ సైనికుల కాల్పుల్లో కూడా కొన్ని సార్లు పిల్లలు బలయ్యేవారని, ఎందుకంటే, పిల్లలను రక్షణ కవచంలా ముందుపెట్టుకొని ఐసిస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపేవారని అజీత్ తెలిపారు. ‘ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనసు గిలగిలా కొట్టుకునేది. మేము వారిని చంపకపోతే వారు మమ్మల్ని చంపుతారు.ఉగ్రవాదులను చంపడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. పిల్లలకు ఆత్మాహుతి జాకెట్లను తొడిగి ముందుకు పంపించిన సందర్భాలు కూడా తమకు ఎదురైనట్లు ఆయన వివరించారు.
బాల సైనికుల శిక్షణలో పాల్గొనకపోతే పిల్లలను ఉగ్రవాదులు చితకబాదేవారట. చేరనన్నందుకు తన కాలును మూడు ముక్కలు చేశారని ఐసిస్ నుంచి తప్పించుకొచ్చిన 11 ఏళ్ల నౌరి తెలిపాడు. కాలు ఎముకలు అతుకున్నప్పటికీ తాను నడవలేక పోయానని, దాంతో ‘యూజ్‌లెస్ ఫెల్లో’ అని తిట్టి తన ను ఇంటికి తీసుకెళ్లి పోవాల్సిందిగా తన నానమ్మను ఆదేశించారని, అలా వారి నుంచి బయటపడ్డానని నౌరి చెప్పాడు. ఇలా ఏదో రకంగా ఐసిస్ చెర నుంచి బయట పడిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ.