చైనాను ముంచెత్తిన కుండపోత వర్షాలు!
చైనాలో కురిసిన కుండపోత వర్షాలతో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి.
భారీ వర్షాలతో చైతా అతలాకుతలం అవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుబే రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలు చెరువుల్లా మారిపోయాయి. వర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహించి వరదలుగా మారడంతో అనేక ప్రాంతాలు కొట్టుకుపోతున్నాయి. యాంగ్జే నదీతీర లోతట్టు ప్రాంతాలైన సిచువాన్, ఛోంగ్ క్వింగ్, గ్విజౌ, హుబే, జైంగ్సు ప్రాంతాలనుంచి సుమారు 11 లక్షలమందిని ఖాళీచేయించి పునరావాలసాలకు తరలించారు. జూన్ 30 నుంచి ఏకథాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటిదాకా 128 మంది చనిపోగా 42 మంది దాకా అదృశ్యమైనట్లు ప్రభుత్వ నివేదికలను బట్టి తెలుస్తోంది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చైనాలోని 11 ప్రాంతాల వరకూ పూర్తిగా నీటమునిగినట్లు చైనా పౌరసంబంధాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. 295,200 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. 41,000 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. రవాణా, విద్యుత్, టెలికాం సౌకర్యాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటిదాకా సుమారు 39వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.
హుబే రాష్ట్రంలోని జౌహే నది ప్రదాస్థాయికి మించి ప్రవహిస్తోంది. జౌహే నది వరదలతో దాజౌ నగరం పూర్తిగా నీటమునిగిపోయింది. నగరంలోని దాదాపు 30 వేలమంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నవారికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోంది. ఆర్మీ, నౌకాదళాల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది.