బీజింగ్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భారీ ప్రాజెక్టులు చేపట్టడంలో తనకు తానే సాటి అంటూ ప్రశంసలు అందుకుంటున్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే తొలి ‘ఫారెస్ట్ సిటీ’ని నిర్మిస్తోంది. ప్రపంచంలో అతి ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తున్న దేశం కూడా చైనా అవడంవల్ల కాబోలు, కాలుష్యాన్ని గ్రహించి, ప్రాణ వాయువులను విడుదల చేసే ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. దక్షిణ చైనాలోని గ్వాంక్సీ రాష్ట్రంలో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్ట్ 2020 సంవత్సరం నాటికి పూర్తి కానుంది.
ఈ ఫారెస్ట్ సిటీలో పది లక్షల మొక్కలు, 40 వేల పెరిగిన చెట్లు ఉంటాయట. ఇళ్లు, ఆఫీసులు, హోటళ్లు, ఆస్పత్రులు, స్కూళ్లు, కమ్యూనిటీ సెంటర్ల చుట్టూ చెట్లు, పూదోటలు, పొదలు పరుచుకొంటాయట. ఒక విధంగా చెప్పాలంటే అడవిలోనే ఈ నగరం ఉంటుంది. లీ నది పక్కన చెట్లతో కూడిన పర్వతాల మధ్యన నిర్మిస్తున్న ఈ నగరానికి ‘లూజౌ ఫారెస్ట్ సిటీ’ అని పేరు పెట్టారు. అపార్ట్‌మెంట్ల తరహాలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో ప్రతి అంతస్తులో మొక్కలు పెంచుతారు. వెలుపల వందరకాల చెట్లను కూడా పెంచుతున్నారు. లౌజౌ మున్సిపాలిటీ అర్బన్ ప్లానింగ్ చేపట్టిన ఈ నగరానికి ‘స్టిఫానో బోయిరీ’ అనే ఇటలీ సంస్థ డిజైన్ చేసింది.
432 ఎకరాలను ఆక్రమిస్తున్న ఈ నగరం న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌లో సగం ఉంటుంది. ఈ నగరంలో పరుచుకున్న పచ్చదనం ఏడాదికి పదివేల టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్‌ను పీల్చుకుంటుందని స్టిఫానో బోయిరీ ఆర్కిటెక్ట్ తెలిపారు. అలాగే ఏడాదికి 57 టన్నుల కాలుష్య కారకాలకు పీల్చుకోని 900 టన్నుల ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని కూడా తెలిపింది. 900 టన్నుల ఆక్సిజన్ అంటే ఓ మనిషికి 95 ఏళ్లు పరిపోయేటంత. అందమైన ఆకర్షణీయమైన రోడ్లతోపాటు అతివేగంగా దూసుకుపోయే ఎలక్ట్రిక్ రైళ్ల కోసం కూడా మార్గాలను నిర్మిస్తున్నారు. ధ్వనికాలుష్యం లేకుండా జీవ వైవిధ్యం పరిఢవిల్లనున్న ఈ ఫారెస్ట్ సిటీలో నివాసం కల్పించేది కేవలం 30వేల మందికేనని మున్సిపల్ అధికారులు తెలిపారు.
స్టిఫానో బోయిరీ సంస్థ ఇంతకుముందు ఇలాంటి ఫారెస్ట్ సిటీలను, అపార్ట్‌మెంట్లను వివిధ దేశాల్లో నిర్మించింది. వాటితో పోలిస్తే ఈ ఫారెస్ట్‌లో నివాసితులు తక్కువ, చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇటలీలోని మిలాన్ నగరంలో ‘వర్టికల్ ఫారెస్ట్’ పేరిట ఓ ఇళ్ల సముదాయాన్ని నిర్మించింది.