బీజింగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి గురించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని చైనా పేర్కొంది. హృదయ కండరాల నొప్పితో ఆస్పత్రిలో చేరిన కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అన్నింటా తానై వ్యవహరించే కిమ్... ప్రస్తుతం ఒక్కసారి కూడా ప్రజల ఎదుటకు రాకపోవడం, ఉత్తర కొరియా మీడియా కూడా ఈ కథనాలపై మౌనం వహించడంతో వీటికి మరింత బలం చేకూరింది. స్థూలకాయం, చైన్ స్మోకింగ్, అధిక పనిఒత్తిడి కారణంగా గత కొంతకాలంగా కిమ్ అనారోగ్యానికి గురయ్యాని.. ఇటీవలే ఆయనకు శస్త్రచికిత్స జరిగిందన్న వార్తల నేపథ్యంలో... ఉత్తర కొరియా మిత్రదేశం చైనా ప్రభుత్వ వైద్య నిపుణుల బృందాన్ని అక్కడికి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. (కిమ్ చెల్లెలు మరింత క్రూరంగా ఉంటే..)
ఈ నేపథ్యంలో సోమవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షాంగ్.. కిమ్ గురించి చెప్పేందుకు తమ వద్ద సమాచారం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా చైనా వల్లే కోవిడ్-19 ఉద్భవించిందని.. డ్రాగన్ దేశం వల్లే ప్రపంచం సంక్షోభంలో పడిందన్న వార్తలపై స్పందించిన షాంగ్.. తాము కేవలం బాధితులం మాత్రమేనని.. ఎవరికీ హాని చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇక కిమ్ ఆరోగ్యం మెరుగుపడని పరిస్థితుల్లో ఆయన సోదరి, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో కీలక నేతగా ఎదిగిన కిమ్ యో జాంగ్ దేశాధినేతగా బాధ్యతలు స్వీకరిస్తారంటూ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే పితృస్వామ్య భావజాల పోకడలు అధికంగా ఉన్న ఉత్తర కొరియాలో ఓ మహిళకు ప్రభుత్వ పగ్గాలు అప్పగిస్తారా అనే విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. కిమ్ ఆరోగ్యంగానే ఉన్నారని దాయాది దేశం దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్ చుంగ్ ఇన్ స్పష్టం చేశారు.(కిమ్ బతికే ఉన్నాడు!)
Comments
Please login to add a commentAdd a comment