రాజీ ప్రసక్తే లేదు!
► బంతి భారత్ కోర్టులోనే
► సిక్కిం ప్రతిష్టంభనపై చైనా స్పందన
బీజింగ్: సిక్కింలో భారత్‌తో కొనసాగుతున్న ప్రతిష్టంభన విషయంలో రాజీకి ఆస్కారం లేదని, సమస్యను పరిష్కరించే బాధ్యత భారత్‌పైనే ఉందని చైనా మంగళవారం స్పష్టం చేసింది. భారత్‌లో చైనా రాయబారి లువో జావోహుయ్ మీడియాతో మాట్లాడుతూ... బంతి భారత్ కోర్టులోనే ఉందని, సమస్య పరిష్కారానికి ఏ మార్గం ఎంచుకోవాలో ఆ ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితిని సరిగా ఎదుర్కోకుంటే యుద్ధం తప్పదన్న చైనా నిపుణుల హెచ్చరికలపై స్పందిస్తూ...సైన్యాన్ని ప్రయోగించాలో లేదో భారతే తేల్చుకోవాలని సూచించారు.
సమస్యకు శాంతియుత పరిష్కారాన్నే చైనా కోరుకుంటోందని, అందుకు భారత బలగాలను ఉపసంహరించుకోవడమే ప్రధాన షరతు అని పేర్కొన్నారు. భారత సైన్యం వెనుదిరిగితేనే అర్థవంతమైన చర్చలకు మార్గం సుగమమవుతుందని వెల్లడించారు. డోకా లాలో పరిస్థితి తీవ్రత తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. చైనా–భూటాన్ దేశాల సరిహద్దు చర్చల్లో జోక్యం చేసుకునే హక్కు , భూటాన్ తరఫున మాట్లాడే అధికారం భారత్‌కు లేవని స్పష్టం చేశారు.
‘మాట వినకుంటే యుద్ధమే’
చరిత్ర నుంచి పాఠాలు నేర్వాలన్న తమ మాట వినకుంటే సిక్కింలో ప్రతిష్టంభనను తొలగించడానికి చైనా బలప్రయోగానికి దిగుతుందని ఆ దేశ నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుత ఘర్షణాత్మక వాతావరణాన్ని సమర్థంగా పరిష్కరించకుంటే యుద్ధం తప్పదేమోనని అని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ అండ్ సైన్సెస్‌లో పరిశోధకుడు హు జోయాంగ్ అన్నారు.
ఆనాడే చైనా వైఖరిని గర్హించిన నెహ్రూ
సిక్కింపై 1890 నాటి చైనా–బ్రిటిష్ ఒప్పందానికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించారన్న చైనా వాదనలోని డొల్లతనం బయటపడింది. అందుకు భిన్నంగా నెహ్రూ.. భూటాన్‌లో అధిక భాగం తమదేనంటున్న చైనాను తప్పు పట్టినట్లు తెలిసింది. 1959, సెప్టెంబర్ 26న అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌లైకి నెహ్రూ రాసిన లేఖలో తాజా విషయం వెలుగుచూసింది.
‘సిక్కిం, భూటాన్ సరిహద్దులు తాజా చర్చల పరిధిలోకి రావని మీరనడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియడం లేదు. భూటాన్‌లోని అధిక శాతం భూభాగాలు చైనాలో అంతర్భాగమని చైనా పటాలు చూపుతున్నాయి’ అని నెహ్రూ పేర్కొన్నారు. భారత్–భూటాన్ ఒప్పందం ప్రకారం భూటాన్ అంతర్జాతీయ వ్యవహారాలను ఇతర దేశాలతో చర్చించే అధికారం భారత్‌కు మాత్రమే ఉందని తెలిపారు. సిక్కిం అంతర్గత పాలన, అంతర్జాతీయ సంబంధాలపై భారత్‌కే సంపూర్ణ అధికారం ఉందన్న సంగతిని చైనా 1890లోనే గుర్తించిందని వెల్లడించారు.