బీజింగ్: కరోనా కరాళ నృత్యంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలకు చైనా మరోసారి భయపెట్టే వార్త చెప్పింది. చైనా సరిహద్దుల్లో ఉన్న మంగోలియాలోని ఖోవ్‌డ్ ప్రావిన్స్‌లో ఇటీవల రెండు బుబోనిక్ ప్లేగ్ వ్యాధి కేసులు బయటపటపడ్డాయని ఆ దేశ అధికారిక మీడియా జింగ్వా ఆదివారం వెల్లడించింది. అడవి ఉడుత (మర్మోట్) మాంసం అమ్మే వ్యక్తి (27), అతని తమ్మునికి జూలై 1న ప్లేగ్ నిర్ధారణ అయిందని తెలిపింది. వారిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. వారితో కాంటాక్ట్ అయిన 146 మందిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారని వెల్లడించింది.
(చదవండి: గులాబీ రంగు మంచు.. పర్యాటకుల ఆందోళన)
ఇక బుబోనిక్ ప్లేగ్‌పై మంగోలియా అలర్ట్ అయింది. తమ దేశంలోని బయన్నూర్ పట్టణంలో గత శనివారం ఒక ప్లేగ్ కేసు నమోదైందని తెలిపిన అక్కడి ప్రభుత్వం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లెవల్ 3 హెచ్చరికలు జారీ చేసింది. ప్లేగ్ నియంత్రణ, నివారణకు 2020 చివరి వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని తెలిపింది. కాగా, బుబోనిక్ ప్లేగ్ వ్యాధి అడవి ఎలుకలు, ఉడుతల్లో ఉండే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. ఈ బ్యాక్టీరీయా కీటకాల ద్వారా ఇతర జంతువులు, మనుషులకు వ్యాప్తిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి అని, సరైన వైద్యం అందకుంటే 24 గంటల్లోనే రోగి మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం తెలుస్తోంది.
ఇదిలాఉండగా..గతేడాది మంగోలియాలోని బయాన్ ఉల్గీ ప్రాంతంలో అడవి ఉడుత పచ్చి మాంసం తిని బుబోనిక్ ప్లేగ్ బారినపడ్డ ఇద్దరు మరణించడం గమనార్హం. ఇక కరోనా విషయంలో ప్రపంచాన్ని అలర్ట్ చేయలేదనే విమర్శల నేపథ్యంలో చైనా ఇటీవల పందుల నుంచి వ్యాపించే జీ4 వైరస్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ కొత్త వైరస్ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేకున్నా.. భవిష్యత్తులో ఇది కరోనా మాదిరే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వుహాన్‌లో నియంత్రణలో ఉన్న కరోనా, బీజింగ్‌లో అధికమవుతోంది. అక్కడ కొత్తగా 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
(భవిష్యత్ మహమ్మారి జీ4..!)
Comments
Please login to add a commentAdd a comment