న్యూఢిల్లీ : ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా రష్యాలో సర్కస్‌కు మంచి ప్రజాదరణ ఉందన్న విషయం తెల్సిందే. జంతు కారుణ్యకారుల ఆందోళనల మేరకు ప్రపంచంలోని పలు దేశాల్లో సర్కసుల్లో జంతువుల విన్యాసాలు నిషేధించగా, రష్యా సర్కసుల్లో ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. రష్యాలోని కరేలియా ప్రాంతంలో అలాంటి సర్కస్ ఒకటి ప్రదర్శన ఇస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది.
దాదాపు 275 కిలోల బరువున్న ఓ గుడ్డేలుగుతో విన్యాసాలు చేయించేందుకు శిక్షకుడు దాన్ని ముందు కాళ్లును పట్టుకోగా అది హఠాత్తుగా ఎదురు తిరిగి సదరు శిక్షకుడి కింద పడేసి, మీదెక్కంది. పక్కనే ఉన్న మరో సర్కస్ ఉద్యోగి దాని కాలితో తంతు దూరం కొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో లోపలి నుంచి కరెంట్ షాక్ యంత్రం తీసుకొచ్చి షాకివ్వడంతో అది శిక్షకుడిని వదిలేసింది. ఈ సంఘటనలో గాయాలైన శిక్షకుడి ఆరోగ్యం ఎలా ఉందో తెలియరాలేదు.
అయితే ఈ సంఘటనను వీడియో తీసిన 27 ఏళ్ల గాలినా గురియేవా ఇప్పటికి తన రెండు కాళ్లు వణుకుతున్నాయని చెప్పారు. గుడ్డేలుగు దాడి చేయడం చూసి ప్రేక్షకుల గ్యాలరీలో అతి సమీపంలో ఉన్న పిల్లలు, పెద్దలు భయంతో పరుగులు తీశారని ఆమె తెలిపారు. సర్కస్ విన్యాసాల వేదికకు, ప్రేక్షకుల గ్యాలరీకి మధ్య ఎలాంటి ఫెన్సింగ్ లేదని ఆమె చెప్పారు. ఇలాంటి సంఘటన తాను చూడడం ఇదే మొదటి సారని ఆమె చెప్పారు. మొదట్లో ఇదీ విన్యాసాల్లో భాగమేనని అనుకున్నామని, తోటి సర్కస్ ఉద్యోగి గుడ్డేలుగును తన్నడం మొదలు పెట్టడంతో అప్పుడు అది దాడిగా భావించి, భయపడ్డామని పలువురు ప్రేక్షకులు తెలిపారు. గతంలో ఇలాంటి జంతు విన్యాసాల సందర్భంగా శిక్షకులు మరణించిన సంఘటనలు లేకపోలేదు. ఇప్పుడు గురియేవా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment