భారతీయులకు దన్నుగా హిల్లరీ
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భారతీయులకు అండగా నిలిచారు. భారతీయ కమ్యూనిటీని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అవమానించారంటూ ఆమె మండిపడ్డారు. ఆయన చర్య విభజన రాజకీయలను ప్రతిబింబిస్తోందని, విద్వేషాన్ని చూపిస్తోందని అన్నారు. నకిలీ భారతీయ ఇంగ్లిష్ యాసలో భారత్ కు చెందిన కాల్‌సెంటర్ ఉద్యోగిని వెక్కిరిస్తూ డెలావేర్ సభలో ట్రంప్ మాట్లాడిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో ట్రంప్పై తీవ్ర విమర్శలు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలోనే 'డోనాల్డ్ ట్రంప్ భారతీయ కార్మికులను అవహేళన చేశారు. తప్పుగా వారిని అనుకరిస్తూ వారి యాసను వెక్కిరించారు. ఇది ఆయనకు ఉన్న అగౌరవ లక్షణాన్ని, ఆ కమ్యూనిటీపై ఉన్న ద్వేషాన్ని చూపిస్తుంది. మత విద్వేషం, విభజన అనే అంశాలే ప్రాతిపదికగా ట్రంప్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
అది నేను చాలా అపాయకరం అని భావిస్తున్నాను. దేశ పరంగా చూస్తే.. స్నేహితులు, సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు అనేవి అత్యవసరం. ఇలాంటి ప్రచారంతో భిన్నవర్గాలను అవమానిస్తున్న ట్రంప్ గురించి ఓసారి ఆలోచించండి' అని హిల్లరీ ప్రచార కార్యక్రమ చైర్మన్ జాన్ పోడిస్టా తెలిపారు.