
కొలంబియాపై ‘జికా’ దెబ్బ
ముగ్గురిని బలిగొన్న వైరస్
అధికారికంగా తొలిసారి ప్రకటన
బొగోటా: ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ కొలంబియా దేశంలో మృత్యుఘంటికలు మోగించింది. ఈ వైరస్ కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. జికా కారణంగా ఈ మరణాలు సంభవించాయని ఆ దేశం ధ్రువీకరించింది. ఇలా ధ్రువీకరించడం తొలిసారి కావడం విశేషం. కొలంబియా జాతీయ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన ద్వారా మరణాల విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. జికా వైరస్ కారణంగా అత్యంత అరుదైన నరాల వ్యాధి (గుల్లెన్ బారె సిండ్రోమ్) బారిన పడి వారు ముగ్గురు మృత్యువాత పడ్డారని తెలిపింది. ఈ వ్యాధి సోకిన వారు మృత్యువాత పడటం తక్కువైనా.. అది మాత్రం ప్రమాదకరమైనదేనని వైద్యులు చెబుతున్నారు.
గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టే పిల్లలు చిన్న తలతో పుట్టడం జికా లక్షణాల్లో మరొకటి. దీనిపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం స్పందిస్తూ.. జికా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాటిన్ అమెరికా దేశాల్లో గర్భిణులకు అబార్షన్, మహిళలకు గర్భనిరోధక విధానాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా దేశాల్లో అబార్షన్ తీవ్రమైన నేరం. తల్లికి ప్రమాదకరమైన పరిస్థితి అయితే తప్ప అబార్షన్‌కు అక్కడి చట్టాలు అంగీకరించవు. మహిళలు గర్భం దాల్చవద్దని ఐక్యరాజ్యసమితి విభాగం ఎలా చెబుతుందని అక్కడి మహిళలు మండిపడుతున్నారు.