ప్రధాని హత్యకు కుట్ర.. పది మందికి ఉరిశిక్ష
ఢాకా(బంగ్లాదేశ్): బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హత్యకు పథకం రచించారనే ఆరోపణలపై 10 మంది ఉగ్రవాదులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో వ్యక్తికి జీవిత ఖైదు, మరో 9 మందికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపాల్‌గంజ్ జిల్లాలోని ఓ కాలేజీ మైదానంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి సభ ఏర్పాటు చేశారు.
అయితే ఆమె ప్రసంగానికి ఒక రోజు ముందు ఉగ్రవాదులు సభ ప్రాంగణ సమీపంలో 76 కేజీల బాంబును అమర్చారు. పోలీసుల తనిఖీల్లో బాంబు బయటపడింది. దీంతో హసీనా హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హర్కత్ ఉల్ జీహాద్ అల్ ఇస్లామీ అధ్యక్షుడు ముప్తీ హన్నన్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించగా.. ఒకరు బెయిల్‌పై విడుదల అయ్యారు. మరో 15 మంది పరారీలో ఉన్నారు. ముఫ్తీ హన్నన్‌ను 2005లో అరెస్ట్ చేసి, 2017 ఏప్రిల్‌లో ఉరి తీశారు. బ్రిటీష్ హైకమిషనర్‌పై గ్రెనేడ్ దాడిలో ప్రధాన నిందితుడు హన్నన్. అంతేకాదు.. దేశవ్యాప్తంగా బాంబు దాడులకు పథక రచన చేసిన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.