
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్. కాగా అతను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం.
ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వివరించాడు.
మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్‌కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు.
ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు.
చదవండి: Tamim Iqbal Retirement: స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటన