Bangladesh cricketer
-
దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వివరించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్‌కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: Tamim Iqbal Retirement: స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటన -
స్వదేశానికి కేకేఆర్ క్రికెటర్.. ఆడింది ఒక్కటే మ్యాచ్!
కేకేఆర్ ఆటగాడు.. స్టార్ క్రికెటర్ లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన లిటన్ దాస్ కుటుంబ సమస్యల కారణంగా అర్థంతరంగా లీగ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని కేకేఆర్ ట్విటర్లో అధికారికంగా ద్రువీకరించింది. ''లిటన్ దాస్ బంగ్లాదేశ్‌కు పయనమయ్యాడు. ఇది మాకు నష్టం కలిగించేది. కానీ కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అతను వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికి మా మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది. ఈ కష్ట సమయం నుంచి లిటన్ దాస్ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది. ఇక గతేడాది జరిగిన వేలంలో యాక్సిలరేటెడ్ రౌండ్లో కనీస ధర రూ.50 లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా లిటన్‌దాస్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటైన ఈ వికెట్ కీపర్ లలిత్ యాదవ్, అక్షర్ పటేల్‌ల స్టంపౌట్ చాన్స్ మిస్ చేసుకున్నాడు. ఇక ఆర్సీబీపై విజయంతో కేకేఆర్ ఈ సీజన్లో నాలుగు వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్ 29న ఈడెన్ గార్డెన్ వేదికగా తర్వాతి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది. చదవండి: వన్డే క్రికెట్లో పాకిస్తాన్ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే -
డోపింగ్‌కు పాల్పడ్డ బంగ్లాదేశ్ పేసర్‌పై వేటు
బంగ్లాదేశ్ యువ పేసర్ షోహిదుల్ ఇస్లాంపై ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అనర్హత వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కావడంతో ఐసీసీ అతనిపై 10 నెలల నిషేధం విధించింది. ఈ ఏడాది మే 28 నుంచి పది నెలల పాటు నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించింది. అనర్హత వేటు అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని వివరించింది. బంగ్లాదేశ్ తరఫున ఓ టీ20 ఆడిన 27 ఏళ్ల షోహిదుల్.. 2023 మార్చి 28 తర్వాతే మైదానంలోకి అడుగపెట్టాలని ఆదేశించింది. డోపింగ్ నిరోధక కోడ్ ఆర్టికల్ 2.1ని ఉల్లంఘించిన నేరాన్ని షోహిదుల్ అంగీకరించిన తరువాత ఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. షోహిదుల్ మూత్ర నమూనాలో నిషేధిత పదార్థం క్లోమిఫెన్ ఉన్నట్లు ఐసీసీ నిర్ధారించింది. కాగా షోహిదుల్ ఇస్లాం ఇటీవల న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ల్లో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే జట్టు సమీకరణల్లో భాగంగా అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. చదవండి: WC 2023: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన! -
"నన్ను డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారు.." ప్రగల్భాలు పలికిన బంగ్లా వికెట్ కీపర్
శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (105) చేసిన రహీమ్.. టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించానన్న గర్వంతో ఊగిపోతున్న రహీమ్ తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌లో తనను క్రికెట్ మాంత్రికుడు డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారంటూ రహీమ్ ప్రగల్భాలు పలికాడు. ఈ సందర్భంగా రహీమ్ మాట్లడుతూ.. బంగ్లాదేశ్ తరఫున 5 వేల టెస్టు పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా నిలవడం గర్వంగా ఉంది. అయితే ఈ రికార్డును చాలామంది సీనియర్లు బద్దలు కొడతారు. బంగ్లా జట్టులో 8000, 10000 పరుగులు పూర్తి చేసే ఆటగాళ్లు కూడా ఉన్నారు. నేను బ్యాటింగ్ చేస్తుంటే బంగ్లాదేశీలకు బ్రాడ్‌మన్‌లా కనిపిస్తాను. అలా వారు అంటుంటే చాలా గర్వంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్ తరఫున 81 టెస్టులు ఆడిన ముష్ఫికర్ రహీమ్ 36.8 సగటున 3 డబుల్ సెంచరీలు, 8 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5037 పరుగులు చేశాడు. మరోవైపు ఆసీస్ ఆల్‌టైం గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ 52 టెస్టుల కెరీర్లో 99.94 సగటున 29 సెంచరీల సాయంతో 6996 పరుగులు చేశాడు. ఈ క్రికెట్ దిగ్గజంతో రహీమ్‌కు పోలికేంటీ అని నెటిజన్లు బంగ్లాదేశీ వికెట్‌కీపర్‌ను తూర్పారబెడుతున్నారు. చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు! -
NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు
Edabot Hossain: క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ఎబాదత్ హొసేన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా పరుగుల ఖాతా తెరవని తొలి అంతర్జాతీయ క్రికెటర్ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్, శ్రీలంక ఆటగాడు లహీరు కుమార వరుసగా 9 ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే పరిమితం కాగా, తాజాగా వారి రికార్డును హొసేన్ తిరగరాశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు ఖాతా తెరవకుండా నాటౌట్‌గా నిలిచిన హోసేన్.. 3 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ రికార్డుతో పాటు హొసేన్ మరో అవమానకర రికార్డును సైతం సొంత చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల తర్వాత అతి తక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హొసేన్.. 16 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో చేసిన 2 పరుగులే అతనికి అత్యధికం. ఈ జాబితాలో హొసేన్ తర్వాత జింబాబ్వే మాజీ ఆటగాడు పోమీ బాంగ్వా (16 ఇన్నింగ్స్‌ల తర్వాత 16 పరుగులు), టీమిండియా పేసర్ బుమ్రా (16 ఇన్నింగ్స్‌ల తర్వాత 18 పరుగులు) ఉన్నారు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లా పేసర్ ఎబాదత్ హొసేన్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ పడగొట్టి కివీస్‌పై సంచలన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో టామ్ లాథమ్(252), డెవాన్ కాన్వే(109) చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 521/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ట్రెంట్ బౌల్ట్(5/43), సౌథీ(3/28), జేమీసన్(2/32)ల ధాటికి 126 పరుగులకే కుప్పకూలింది. చదవండి: ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్ -
కొట్టేస్తా... ఏమనుకున్నావ్!
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానంలో తన సహచరుడిపైనే చెయ్యెత్తాడు. కుడి చేతితో దాదాపు తన సహచరుడి ముఖం మీద కొట్టినంత పని చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా సముదాయించినా అతనిలో కోపం తగ్గలేదు. వివరాల్లోకెళితే ‘బంగబంధు టి20 కప్’ సందర్భంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. మ్యాచ్ జరుగుతుండగా బౌన్సర్‌ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ అఫిఫ్ హొస్సేన్ కొట్టిన షాట్ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్ రహీమ్, ఫైన్ లెగ్ ఫీల్డర్ నజుమ్ అహ్మద్ క్యాచ్ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. కానీ రహీమ్ తడబడుతూనే క్యాచ్ పట్టేశాడు. క్యాచ్ పట్టిన వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు. రహీమ్ చర్యకు నజుమ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్ అందుకోవాలి. కానీ రహీమ్ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టడం గమనార్హం. సీనియర్ ప్లేయర్ అయిన రహీమ్ ఓ జూనియర్ క్రికెటర్ పట్ల ఇలా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు. -
షకీబుల్ హసన్‌కు ఊరట
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌కు నేటితో ఊరట దక్కనుంది. అతనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విధించిన నిషేధం గురువారంతో ముగియనుంది. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు బంగ్లాదేశ్ టి20 కెప్టెన్ మహ్ముదుల్లా పేర్కొన్నాడు. ప్రస్తుతం 33 ఏళ్ల షకీబ్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉన్నాడు. బుకీల గురించి బోర్డుకు సరైన సమయంలో సమాచారం ఇవ్వని కారణంగా గతేడాది అక్టోబర్ 29న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్ షకీబ్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. రెండు సంవత్సరాలలో ఒక ఏడాది క్రికెట్ ఆడకుండా నిషేధం విధించగా... మరో ఏడాదిపాటు సస్పెన్షన్ అమలులో ఉంటుందని పేర్కొంది. నేటితో ఏడాది నిషేధం ముగియనుండటంతో దేశవాళీ టోర్నీలతో షకీబ్ మళ్లీ క్రికెట్ మొదలుపెట్టే చాన్స్ ఉంది. -
మాజీ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజా(36) కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ప్రస్తుతం మష్రాఫ్ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ క్రమంలో మోర్తాజా సోదరుడు మాట్లాడుతూ.. ‘నా సోదరుడికి రెండు రోజులుగా జ్వరంగా ఉంది. నిన్న రాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లో స్వీయ నిర్భంధంలో ఉన్నాడు’. అని తెలిపారు. ఇక కరోనా సోకిన రెండో బంగ్లాదేశ్ క్రికెటర్ మోర్తాజా. అంతకుముందు కొన్ని గంటల క్రితమే మరో క్రికెటర్ నఫీస్ ఇక్బాల్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. (దాదా ఇంట్లో మరో ఇద్దరికి కరోనా) కాగా బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుడైన మోర్తాజా ఇప్పటికి క్రికెట్ నుంచి విరమణ పొందలేదు. మర్తాజా తన కెరీర్లో 220 వన్డేలు, 36 టెస్టులు, 54 టీ-20లు ఆడారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకిన 300 కుటుంబాలకు సాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక బంగ్లాదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటి వరకు 1,05,000 మంది కరోనా బారిన పడగా, 1,300 మంది మరణించారు. దాదాపు 43, 000 వేల మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు అయిదుగురు అంతర్జాతీయ క్రికెటర్లకు కరోనా నిర్ధారణ జరిగింది. మే నెలలో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ తౌఫీక్ ఉమర్‌కు కరోనా పాజిటివ్ రాగా ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. గతవారం పాకిస్తాన్ లెజెండ్ షాహిద్ అఫ్రిది కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శనివారం మోర్తాజా, ఇక్బాల్ కరోనా బారిన పడగా..మరో పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు జాఫర్ సర్ఫ్రాజ్, రియాజ్ షేక్ కూడా కరోనా సోకినట్లు తేలింది.(‘ఎందరున్నా జడేజానా అత్యుత్తమం’) -
ఎంపీగా గెలిచిన బంగ్లా కెప్టెన్
ఢాకా : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్ ఆరంభించాడు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందాడు. ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ తరఫున నరైల్-2 లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఈ బంగ్లా కెప్టెన్ ఘన విజయం సాధించాడు. 35 ఏళ్ల మొర్తాజాకు మొత్తం 2,74,418 ఓట్లు రాగా, అతడి సమీప ప్రత్యర్థికి 8,006 ఓట్లు వచ్చాయి. తద్వారా క్రికెట్ ఆడుతూనే ఎంపీగా గెలిచిన వ్యక్తిగా మొర్తాజా చరిత్రకెక్కాడు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో అధికార అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలోని మొత్తం 300 స్థానాలకు గాను అవామీ లీగ్ ఏకంగా 288 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా.. విండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు రాజకీయాల్లోకి వెళ్తున్నట్లు చిన్న హింట్ ఇచ్చాడు. అనుకున్నట్లే అవామీ లీగ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందాడు. దీంతో 2019 ప్రపంచకప్ తర్వాత ఈ పేసర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. -
ఎన్నికల బరిలో క్రికెటర్!
ఢాకా : బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ మష్రఫె మొర్తజా రాజకీయ ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. వచ్చే నెల బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో మొర్తజా పోటీ చేస్తున్నట్లు సోమవారం ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న బంగ్లాదేశ్‌లో మొర్తజాకు విపరీతమైన క్రేజ్ ఉంది. అధికార పార్టీ అయిన అవామీ లీగ్ తరుపునే మొర్తజా బరిలోకి దిగుతున్నాడు. రాజకీయాల్లోకి రావాలన్న మొర్తజా నిర్ణయానికి ప్రధాని హసీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవామీ లీగ్ అధికార ప్రతినిధి మహబూబుల్ అలం హనీఫ్ తెలిపారు. మొర్తజా తన సొంత జిల్లా అయిన పశ్చిమ బంగ్లాదేశ్‌లోని నరైలీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లాలన్న క్రికెటర్ల ప్రయత్నాన్ని అడ్డుకోబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. అటు రాజకీయాలు, ఇటు కెరీర్‌ను మోర్తాజా బ్యాలెన్స్ చేసుకోగలడని తాము విశ్వసిస్తున్నట్టు బోర్డు అధికార ప్రతినిధి జలాల్ యూనుస్ తెలిపారు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన మొర్తజా 2019 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలనే అతని నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అభిమానులు మోర్తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు. ఇక క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్తకాదు. కానీ వచ్చిన వారంతా రిటైర్మెంట్ అనంతరమే రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. కానీ మొర్తజా మాత్రం కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడు. -
కొలంబోలో బంగ్లా క్రికెటర్ రికార్డు
ఢాకా: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 డిస్మిసల్స్ చేసిన తొలి బంగ్లా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇందులో 88 క్యాచ్ అవుట్లు, మరో 12 స్టంప్ అవుట్లు ఉన్నాయి. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న కొలంబో టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ముష్ఫికర్ తర్వాత అత్యధిక డిస్మిసల్స్ చేసిన బంగ్లా క్రికెటర్‌గా ఖలీద్ మసూద్ (87) రెండో స్థానంలో ఉన్నాడు. 28 ఏళ్ల ముష్ఫికర్ ఇప్పటి వరకు 54 టెస్టులు ఆడాడు. 2005లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 5 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో కలిపి 3243 పరుగులు చేశాడు. -
మరో వివాదంలో చిక్కుకున్న క్రికెటర్!
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీపై మరో కేసు నమోదయింది. గర్ల్ ఫ్రెండ్ అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అరెస్టయి బెయిల్ పై బయటకు వచ్చిన ఈ క్రికెటర్.. తాజాగా మరో కేసులో చిక్కుకున్నాడు. క్రికెటర్ అరాఫత్ తన భర్త అని, ఆయనతో పాటు ఆమె తల్లి తనను కట్నం కోసం తరచూ వేధిస్తున్నాడని అతడి గర్ల్ ఫ్రెండ్ నస్రీన్ సుల్తానా ఫిర్యాదు చేసింది. మహిళలు మరియు పిల్లలు అణచివేత నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఢాకా స్థానిక కోర్టులో క్రికెటర్ ను, అతడి తల్లిని ప్రవేశపెట్టారు. అరాఫత్ ను విచారించేందుకు ఏడు రోజుల కస్డడీకి అనుమతించాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. కేసు విచారించిన ఢాకా స్థానిక కోర్టు బంగ్లా క్రికెటర్ కు జైలుశిక్ష విధించారు. షాహదత్ హుస్సేన్, రుబెల్ హుస్సేన్ ల తర్వాత అరెస్టయిన మూడో క్రికెటర్ అరాఫత సన్నీ. మొదట గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన నస్రీన్, తాను అరాఫత్ భార్యనని విచారణలో వెల్లడించింది. గర్ల్ ఫ్రెండ్(నస్రీన్) ఫొటోల కేసు వ్యవహారంలో అతడు దోషీగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అరాఫత్ బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు 16 వన్డేలు, 10 ట్వంటీ20 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. క్రికెటర్ల వ్యక్తిగత విషయాలపై తాము స్పందించబోమని బంగ్లా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. -
హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ క్రికెటర్
ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హాసన్, ఆయన భార్య ఉమ్మె అహ్మద్ షిషిర్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నారు. శుక్రవారం ఢాకా నుంచి రాయల్ టులీప్ సీ రిసార్ట్‌కు షకీబల్ దంపతులను తీసుకెళ్లిన హెలికాప్టర్.. అక్కడ వారు దిగిన తర్వాత వెనుదిరిగిన కాసేపటికే కూలిపోయింది. హెలికాప్టర్లో పైలట్ సహా ఐదుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. తాను క్షేమంగా ఉన్నానని, అయితే ఈ వార్త వినగానే షాకయ్యానని షకీబల్ అన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను షూటింగ్లో ఉన్నానని చెప్పాడు. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ కోసం షకీబల్ తన భార్యతో కలసి రాయల్ టులీప్ సీ రిసార్ట్‌కు వెళ్లాడు. -
వివాదస్పద క్రికెటర్ పై నిషేధం తొలగింపు
ఢాకా: క్రికెటర్ షాదత్ హుస్సేన్ పై విధించిన నిషేధాన్ని బంగ్లాదేశ్ ఎత్తివేసింది. స్వదేశంలో మ్యాచ్ లు ఆడేందుకు అతడిని అనుమతించింది. క్రిమినల్ కేసు ఎదుర్కొన్న హుస్సేన్ పై గతేడాది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నిషేధం విధించింది. తన ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల బాలికను అతడు వేధించినట్టు ఆరోపణలు రావడంతో దుమారం రేగింది. ఈ వివాదం మీడియాలో హైలెట్ కావడంతో హుస్సేన్ తో పాటు అతడి భార్య న్రిట్టో షాదత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిపై బీసీబీ చర్య తీసుకుంది. తాను తప్పు చేయలేదని బుకాయించిన హుస్సేన్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పాడు. తాను తప్పు చేశానని, మన్నించాలని ఏప్రిల్ 28న బీసీబీని వేడుకున్నాడు. ఈ కేసులో నేరం రుజువయితే హుస్సేన్, అతడి భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే హుస్సేన్ తో బాధిత బాలిక కుటుంబంతో రాజీకి వచ్చిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. బాలిక కుటుంబానికి హుస్సేన్ డబ్బు ముట్టజెప్పి, తనపై ఆరోపణలను ఉపసంహరించుకునేలా ఒప్పించాడని తెలిపాయి. -
షహదత్‌పై అభియోగాలు నమోదు
ఢాకా: పని అమ్మాయిని హింసించిన కేసులో బంగ్లాదేశ్ జాతీయ క్రికెటర్ షహదత్ హుస్సేన్‌పై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. చట్ట విరుద్ధంగా బాలికను పనిలో పెట్టుకోవడమే కాకుండా దాడి చేయడం, హింసించడం జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ ఇన్స్పెక్టర్ షఫీకుర్ రెహమాన్ వెల్లడించారు. పోలీసులు చేస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవని హుస్సేన్ వ్యాఖ్యానించాడు. ‘నేను అమాయకుడ్ని. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్లకు నా గురించి ఏం తెలుసు. నా కెరీర్‌ను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర ఇది’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌లో షహదత్‌పై ఈ ఆరోపణలు రావడంతో బంగ్లా క్రికెట్ బోర్డు అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ కేసులో దోషులుగా తేలితే హుస్సేన్, అతని భార్యకు 14 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది. -
దోషీగా తేలితే బంగ్లా క్రికెటర్‌కు 14 ఏళ్ల జైలు
ఢాకా: ఇంట్లో పనిచేసే అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ దంపతులు దోషులుగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్షపడనుంది. షహదత్, ఆయన భార్య నృటో షహదత్‌పై ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు పోలీసులు తెలిపారు. షహదత్ దంపతులు తమ ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల అమ్మాయిని హింసించినట్టు వారిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. షహదత్ దంపతులపై వచ్చిన ఆరోపణలు తమ ప్రాథమిక దర్యాప్తులో నిజమని తేలినట్టు పోలీసులు చెప్పారు. కాగా తాము ఎలాంటి తప్పూ చేయలేదని షహదత్ వాదిస్తున్నాడు. తన కెరీర్‌ను నాశనం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించాడు. అతనిపై ఆరోపణలు రాగానే అన్ని ఫార్మాట్ల నుంచి బంగ్లా క్రికెట్ బోర్డు సస్పెండ్ చేసింది. బంగ్లా తరపున షహదత్ 38 టెస్టులు, 51 వన్డేలు ఆడాడు. -
బంగ్లా క్రికెటర్ షహాదత్పై సస్పెన్షన్ వేటు
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్ షహాదత్ హొస్సేన్‌పై వేటు పడింది. తమ ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల చిన్నారిని తన భార్యతో కలిసి దారుణంగా హింసించాడనే ఆరోపణలతో పోలీసులు ప్రస్తుతం ఈ క్రికెటర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అన్ని ఫార్మాట్ల నుంచి తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్రికెటర్‌తో పాటు అతడి భార్య పరారీలో ఉన్నారు. ‘షహాదత్పై ఉన్న ఆరోపణలతో బోర్డు ఇమేజి దెబ్బతింది. అందుకే ముందుగా అతడిపై ఎలాంటి మ్యాచ్‌లు ఆడకుండా తాత్కాలిక నిషే దం విధిస్తున్నాం. విచారణలో తప్పు లేదని తేలితే నిషేధం ఎత్తేస్తాం’ అని బీసీబీ అధికార ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. దీంతో వచ్చే నెలలో ఆసీస్‌తో జరిగే టెస్టుల సిరీస్‌కు తను దూరం కానున్నాడు. -
క్రికెటర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసుల వేట
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లో పనిచేసే అమ్మాయిని చితకబాదినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షహదత్, ఆయన భార్య నృట్టో షహదత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం ఢాకాలోని ఓ వీధిలో 11 ఏళ్ల బాలిక గాయాలతో ఏడుస్తూ పోలీసులకు కనిపించింది. ఆ అమ్మాయి కంటి దగ్గర, ఇతర చోట్ల గాయాలున్నట్టు గుర్తించారు. పోలీసులు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకున్నారు. క్రికెటర్ షహదత్ ఇంట్లో పనిచేస్తున్నానని.. ఆయన, ఆయన భార్య తనను చిత్రహింసలు పెట్టారని చెప్పింది. పోలీసులు ఆ అమ్మాయిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు షహదత్, ఆయన భార్యపై కేసు నమోదు చేసి.. ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో షహదత్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఆ రోజు ఉదయం కూడా వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. -
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్‌కు విముక్తి
ఢాకా: అత్యాచార కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొసేన్‌కు విముక్తి లభించింది. నటి నజ్నీన్ అక్తర్ దాఖలు చేసిన ఈ కేసును విచారించిన ఢాకా కోర్టు బుధవారం రూబెన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. రూబెల్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. పెళ్లి పేరుతో నమ్మించి తనను అత్యాచారం చేశాడంటూ నజ్నీన్ రూబెల్‌పై కేసు పెట్టింది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ముందు రూబెల్‌ను అరెస్ట్ చేశారు.తాజాగా కోర్టులో ఈ కేసు కొట్టివేయడంతో రూబెల్కు విముక్తి లభించినట్టయ్యింది. రూబెల్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలూ లేవని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. -
రేప్ కేసును ఉపసంహరించుకున్న నటి
*రూబెల్కు ఊరట ఢాకా: వన్డే ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ ప్రదర్శనను ఆ దేశవాసులు ఏ స్థాయిలో అభిమానిస్తున్నారో ఈ ఉదంతం చూస్తే తెలిసిపోతుంది. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా పేసర్ రూబెల్ హోస్సేన్ అత్యద్భుత బౌలింగ్‌తో తమ అభిమానుల హృదయాల్లో హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అనతికి జీవితంలోనే అతి పెద్ద ఊరట లభించింది. ఈ మెగా టోర్నీకి రాకముందు తను అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బంగ్లాకు చెందిన చెందిన 19ఏళ్ల నటి నజ్నీన్ అక్టర్ హప్పీ అతడిపై ఈ కేసు పెట్టింది. అయితే ప్రపంచ కప్ క్వార్టర్స్ కు చేరి తమ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద ఫీట్‌కు కారణమైన రూబెల్‌పై ఆమె తన కోపాన్ని చల్లార్చుకుంది. అతడిని క్షమించేస్తున్నట్లు ప్రకటించి... వెంటనే రేప్ కేసును వెనక్కి తీసుకుంది. 'ఇప్పుడు రూబెల్కు వ్యతిరేకంగా నేను ఎలాంటి ఆధారాన్ని సాక్ష్యాన్ని ఇవ్వను. దీంతో అతడిపై ఇక ఏ కేసూ ఉండదు' అని హప్పీ స్పష్టం చేసింది. అయితే అంతకుముందు... రూబెల్స్పై ప్రపంచకప్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు హప్పీ లాయర్ ఆమెతో స్పష్టం చేశారు. దీంతో తను కూడా కేసుపై పునరాలోచించింది. -
రూబెల్ హుస్సేన్‌కు బెయిల్
ఢాకా: అత్యాచారం కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌కు బెయిల్ లభించింది. ఈనెల 24న వరల్డ్‌కప్ కోసం బ్రిస్బేన్ వెళ్లాల్సి ఉండటంతో బెయిల్ మంజూరు చేయాలని క్రికెటర్ చేసుకున్న పిటిషన్‌ను ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇంచార్జ్ జడ్జి కేఎం ఇమ్రూల్ విచారించారు. రూబెల్ ఆదివారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యాడు. సోమవారం బంగ్లాదేశ్ జట్టుతో కలవనున్నాడు. క్రికెటర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని బంగ్లాదేశ్ మోడల్ 19 ఏళ్ల నజ్నిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రేప్ కేసులో బంగ్లా క్రికెటర్ కు బెయిల్
ఢాకా: అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్ కు బెయిల్ లభించింది. ఢాకా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు అతడికి బెయిల్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల మోడల్- హీరోయిన్ ఒకామె ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ గడువు ముగియడంతో ఈనెల 8న ఢాకా మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట అతడు లొంగిపోయాడు. తాజాగా అతడికి మరోసారి బెయిల్ లభించింది. ప్రపంచకప్‌కు ఎంపికైన రూబెల్ హొస్సేన్ భవితవ్యం ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది.