ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. మైదానంలో తన సహచరుడిపైనే చెయ్యెత్తాడు. కుడి చేతితో దాదాపు తన సహచరుడి ముఖం మీద కొట్టినంత పని చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా సముదాయించినా అతనిలో కోపం తగ్గలేదు. వివరాల్లోకెళితే ‘బంగబంధు టి20 కప్’ సందర్భంగా సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ఇందులో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. మ్యాచ్ జరుగుతుండగా బౌన్సర్‌ను ఆడే క్రమంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ అఫిఫ్ హొస్సేన్ కొట్టిన షాట్ అక్కడే గాల్లోకి లేచింది. కీపర్ రహీమ్, ఫైన్ లెగ్ ఫీల్డర్ నజుమ్ అహ్మద్ క్యాచ్ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. కానీ రహీమ్ తడబడుతూనే క్యాచ్ పట్టేశాడు. క్యాచ్ పట్టిన వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు. రహీమ్ చర్యకు నజుమ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్ అందుకోవాలి. కానీ రహీమ్ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టడం గమనార్హం. సీనియర్ ప్లేయర్ అయిన రహీమ్ ఓ జూనియర్ క్రికెటర్ పట్ల ఇలా ప్రవర్తించి విమర్శల పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment