
నేడు డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్
గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ
రాత్రి గం. 7:30 నుంచి నుంచి ‘స్టార్ స్పోర్ట్స్’, జియో హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడనుంది. తాజా సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై జట్టునే విజయం వరించగా... ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు భావిస్తోంది. మరోవైపు ఆష్లీ గార్డ్‌నర్ కెపె్టన్సీలోని గుజరాత్ జెయింట్స్ జట్టు తొలిసారి ఫైనల్ చేరాలని తహతహలాడుతోంది.
లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ కూడా 5 మ్యాచ్‌లు నెగ్గినప్పటికీ రన్‌రేట్‌లో ముంబై కంటే మెరుగ్గా ఉన్న ఢిల్లీ జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం. మరోవైపు 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి గుజరాత్ జెయింట్స్ జట్టు ఎలిమినేటర్‌కు చేరింది. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది.
సొంతగడ్డపై మ్యాచ్ ఆడనుండటం హర్మన్‌ప్రీత్ బృందం బలాన్ని మరింత పెంచుతోంది. హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమన్‌జ్యోత్ కౌర్, సజన, యస్తిక భాటియా రూపంలో ముంబై జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్‌గా మెరుపు ఆరంభాలు ఇస్తున్న హేలీ మాథ్యూస్... బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక బ్యాటింగ్‌లో సివర్ బ్రంట్ ఫుల్ ఫామ్ చాటుకుంటోంది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన సివర్... 416 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతోంది. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇరు జట్ల మద్య చివరగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ విజృంభించింది. మిడిలార్డర్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది.
బౌలింగ్‌లో షబ్నమ్ ఇస్మాయిల్, హేలీ మాథ్యూస్, సివర్ బ్రంట్, పారుణిక, అమేలియా, సంస్కృతి, అమన్‌జ్యోత్ కీలకం కానున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన గుజరాత్... వాటికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ, లిచ్‌ఫీల్డ్, డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్ కలిసికట్టుగా కదంతొక్కాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
గత మ్యాచ్‌లో భారీ షాట్లతో ముంబైని వణికించిన భారతి ఫూల్‌మాలి నుంచి అదే తరహా మెరుపులు కొనసాగాలని కోరుకుంటోంది. బౌలింగ్‌లో డాటిన్, తనుజ, కాశ్వి, ప్రియ, మేఘన కీలకం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment