
నేడు ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి ‘స్టార్‌స్పోర్ట్స్’, జియో హాట్‌స్టార్‌లలో ప్రసారం
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు శనివారం ఖరారయ్యాయి. ఇక మిగిలిందల్లా అగ్రస్థానం కోసం పోటీ! పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచిన ఏకైక జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్‌ల పోరాటం కూడా దీని కోసమే! 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌కు ఇది ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా... మంచి రన్‌రేట్‌తో గెలిస్తే అగ్రస్థానంతో తుదిపోరుకు చేరే అవకాశముంది.
8 పాయింట్లతో రన్‌రేట్‌లో వెనుకబడినప్పటికీ... ముంబై జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండటం, సొంత ప్రేక్షకుల మధ్య జరగనుండటం అదనపు అనుకూలతగా మారింది. మాజీ చాంపియన్ ముంబై నేడు జెయింట్స్‌పై, రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిస్తే చాలు ఎలాంటి రన్‌రేట్ సమీకరణాలతో పనిలేకుండా 12 పాయింట్లతో ఫైనల్ బరిలో నిలవొచ్చు. ఇప్పటికైతే ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది.
అనామకం కాదు కీలకం
ముంబై, గుజరాత్ జట్లు ప్లేఆఫ్స్ చేరిన నేపథ్యంలో ఇది అనామక మ్యాచ్ అనుకుంటే పోరపాటే అవుతుంది. ఫైనల్ రేసు కోసం ఇరు జట్ల మధ్య ముమ్మాటికి కీలకపోరే జరుగనుంది! ముంబై జట్టు విదేశీ బ్యాటర్ల బలగంతో పటిష్టంగా ఉంది. నాట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్‌లు ఈ టోర్నీలో నిలకడగా ఫామ్ చాటుకున్నారు. వీళ్లిద్దరితో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, అమెలియా కెర్‌లు కూడా మెరుగ్గానే ఆడుతుండటంతో బ్యాటింగ్ లైనప్‌కు ఏ ఢోకా లేదు. బౌలింగ్‌లోనూ విదేశీ ఆల్‌రౌండర్లే జట్టు విజయాల్లో భాగమవుతున్నారు.
యూపీ వారియర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అమెలియా కెర్ ఐదు వికెట్లతో సత్తా చాటుకుంది. నాట్ సివర్, హేలీ మాథ్యూస్‌లు కూడా అడపాదడపా వికెట్లను పడగొడుతున్నారు. మరోవైపు గుజరాత్ జెయింట్స్ కూడా గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు చెక్ పెట్టింది. 177 పరుగుల భారీ లక్ష్యాన్ని జెయింట్స్ సులువుగా ఛేదించింది. హర్లీన్ డియోల్, బెత్ మూనీ, కెపె్టన్ ఆష్లీ గార్డ్‌నర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్, కాశ్వీ, తనూజ, మేఘన సింగ్‌లు ప్రభావం చూపగలరు.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, అమెలియా కెర్, నాట్ సివర్, అమన్‌జ్యోత్ కౌర్, యస్తిక, సజన, కమలిని, సంస్కృతి, షబ్నమ్, పారుణిక సిసోడియా.
గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ్‌నర్ (కెప్టెన్), బెత్ మూనీ, హేమలత, హర్లీన్ డియోల్, డియాండ్రా, లిచ్‌ఫీల్డ్, కాశ్వీ గౌతమ్, భారతి, తనూజ, మేఘన సింగ్, ప్రియా మిశ్రా.
Comments
Please login to add a commentAdd a comment