WPL 2025: ముంబై మెరిసె... ఫైనల్‌లో హర్మన్‌ బృందం | Mumbai Indians win over Gujarat Giants in Eliminator match | Sakshi
Sakshi News home page

WPL 2025: ముంబై మెరిసె... ఫైనల్‌లో హర్మన్‌ బృందం

Mar 14 2025 3:58 AM | Updated on Mar 14 2025 8:09 AM

Mumbai Indians win over Gujarat Giants in Eliminator match

డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం

రేపు జరిగే టైటిల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ‘ఢీ’

హేలీ మాథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ షో

అదరగొట్టిన సివర్‌ బ్రంట్, హర్మన్‌ప్రీత్‌

సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ముంబై ఇండియన్స్‌ జట్టు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీ మూడో సీజన్‌లో టైటిల్‌ పోరుకు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 47 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. 

బ్యాట్‌తో హేలీ మాథ్యూస్, నాట్‌ సివర్‌ బ్రంట్, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగడంతో ముంబై భారీ స్కోరు చేసింది. అనంతరం బంతితోనూ ముంబై బౌలర్లు హడలెత్తించారు. దాంతో లక్ష్య ఛేదనలో గుజరాత్‌ జెయింట్స్‌ డీలా పడింది. ముంబై ఇండియన్స్‌ జట్టుతో ఆడిన ఏడోసారీ గుజరాత్‌ జట్టు పరాజయాన్నే మూటగట్టుకుంది.   

ముంబై: మాజీ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ 47 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలిచి తుదిపోరుకు చేరింది. శనివారం జరిగే టైటిల్‌ పోరులో గత ఏడాది రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఆడుతుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 

హేలీ మాథ్యూస్‌ (50 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), నాట్‌ సివర్‌ బ్రంట్‌ (41 బంతుల్లో 77; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో విజృంభించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించింది. గుజరాత్‌ జెయింట్స్‌ బౌలర్లలో గిబ్సన్‌ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు 19.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. 

గిబ్సన్‌ (24 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్‌), లిచ్‌ఫీల్డ్‌ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), భారతి (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో హేలీ 3, అమేలియా కెర్‌ 2 వికెట్లు పడగొట్టింది. హేలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

బాదుడే బాదుడు.. 
మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. గుజరాత్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి యస్తిక భాటియా (15; 3 ఫోర్లు) వికెట్‌ కోల్పోయిన ముంబై 37 పరుగులే చేసింది. గిబ్సన్‌ వేసిన ఏడో ఓవర్‌లో సివర్‌ బ్రంట్‌ రెండు ఫోర్లతో జోరు పెంచగా... ప్రియా ఓవర్‌లో హేలీ ‘హ్యాట్రిక్‌’ ఫోర్లతో విరుచుకుపడింది. 

గుజరాత్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 100/1తో నిలిచింది. ఈ క్రమంలో హేలీ 36 బంతుల్లో, సివర్‌ 29 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట మరింత ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 

గిబ్సన్‌ వేసిన 15వ ఓవర్‌లో సివర్‌ రెండు భారీ సిక్సర్లు బాదగా... ప్రియ ఓవర్లో హేలీ వరుసగా 6, 6, 4 కొట్టింది. రెండో వికెట్‌కు 71 బంతుల్లో 133 పరుగులు జోడించిన అనంతరం హేలీ అవుట్‌ కాగా... హర్మన్‌ వచ్చిరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడింది. తనూజ వేసిన 18వ ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టిన హర్మన్‌... చివరి ఓవర్‌లో మరో 2 సిక్స్‌లు బాదింది. దీంతో ముంబై భారీ స్కోరు చేసింది. చివరి 5 ఓవర్లలో ముంబై జట్టు 73 పరుగులు రాబట్టింది.

ఛేజింగ్‌లో జెయింట్స్‌ రనౌట్‌.. 
భారీ లక్ష్యఛేదనలో గుజరాత్‌ ప్రభావం చూపలేకపోయింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ బెత్‌ మూనీ (6) పెవిలియన్‌ చేరగా... కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్‌ (8), హర్లీన్‌ డియోల్‌ (8) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో గుజరాత్‌ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిబ్సన్, లిచ్‌ఫీల్డ్‌ కాస్త పోరాడినా... ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచారు. 

క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు చక్కటి ఫీల్డింగ్‌ తోడవడంతో ముంబై జట్టు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. భారతి, సిమ్రన్‌ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. పేలవ ఫీల్డింగ్‌తో ముంబై బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్‌లు వదిలేసిన గుజరాత్‌ జట్టు... వికెట్ల మధ్య చురుకుగా పరిగెత్తలేక రనౌట్‌ రూపంలో 3 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.

స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: యస్తిక భాటియా (సి) భారతి (బి) గిబ్సన్‌ 15; హేలీ మాథ్యూస్‌ (సి) మూనీ (బి) కాశ్వీ గౌతమ్‌ 77; సివర్‌ బ్రంట్‌ (సి) లిచ్‌ఫీల్డ్‌ (బి) గిబ్సన్‌ 77; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రనౌట్‌) 36; సజన (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–26, 2–159, 3–198, 4–213. బౌలింగ్‌: కాశ్వీ గౌతమ్‌ 4–0–30–1; ఆష్లీ గార్డ్‌నర్‌ 2–0–15–0; తనూజ కన్వర్‌ 4–0–49–0; గిబ్సన్‌ 4–0–40–2; ప్రియా మిశ్రా 3–0–40–0; మేఘనా సింగ్‌ 3–0–35–0. 
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (సి) హేలీ మాథ్యూస్‌ (బి) షబ్నమ్‌ 6; గిబ్సన్‌ (రనౌట్‌) 34; హర్లీన్‌ డియోల్‌ (రనౌట్‌) 8; ఆష్లీ గార్డ్‌నర్‌ (బి) హేలీ మాథ్యూస్‌ 8; లిచ్‌ఫీల్డ్‌ (స్టంప్డ్‌) యస్తిక (బి) కెర్‌ 31; భారతి (బి) హేలీ 30; కాశ్వీ గౌతమ్‌ (రనౌట్‌) 4; సిమ్రన్‌ (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) కెర్‌ 17; తనూజ (సి) అమన్‌జ్యోత్‌ (బి) సివర్‌ 16; మేఘన (సి) సివర్‌ (బి) హేలీ 5; ప్రియ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 166. వికెట్ల పతనం: 1–6, 2–34, 3–43, 4–81, 5–107, 6–112, 7–142, 8– 157, 9–165, 10–166. బౌలింగ్‌: షబ్నిమ్‌ 4–0–35–1; సివర్‌ 4–0–31–1; సైకా 1–0– 8–0; హేలీ 3.2–0–31–3, అమన్‌జ్యోత్‌ 3–0–32–0; అమేలియా కెర్‌ 4–0–28–2.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement