Edabot Hossain: క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు ఎబాదత్ హొసేన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా పరుగుల ఖాతా తెరవని తొలి అంతర్జాతీయ క్రికెటర్ రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్, శ్రీలంక ఆటగాడు లహీరు కుమార వరుసగా 9 ఇన్నింగ్స్‌ల్లో సున్నా పరుగులకే పరిమితం కాగా, తాజాగా వారి రికార్డును హొసేన్ తిరగరాశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు ఖాతా తెరవకుండా నాటౌట్‌గా నిలిచిన హోసేన్.. 3 సార్లు డకౌట్ అయ్యాడు.
ఈ రికార్డుతో పాటు హొసేన్ మరో అవమానకర రికార్డును సైతం సొంత చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల తర్వాత అతి తక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన హొసేన్.. 16 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో చేసిన 2 పరుగులే అతనికి అత్యధికం. ఈ జాబితాలో హొసేన్ తర్వాత జింబాబ్వే మాజీ ఆటగాడు పోమీ బాంగ్వా (16 ఇన్నింగ్స్‌ల తర్వాత 16 పరుగులు), టీమిండియా పేసర్ బుమ్రా (16 ఇన్నింగ్స్‌ల తర్వాత 18 పరుగులు) ఉన్నారు.
ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లా పేసర్ ఎబాదత్ హొసేన్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ పడగొట్టి కివీస్‌పై సంచలన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో టామ్ లాథమ్(252), డెవాన్ కాన్వే(109) చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 521/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ట్రెంట్ బౌల్ట్(5/43), సౌథీ(3/28), జేమీసన్(2/32)ల ధాటికి 126 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: ఎక్కడ మొదలెట్టానో అక్కడే ఉన్నాను.. టీమిండియా పేసర్ ఆసక్తికర ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment