
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ కథ ముగిసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ తమ సెమీస్ ఆశలను బంగ్లాదేశ్‌పై పెట్టుకుంది. ఈ క్రమంలో సోమవారం రావల్పండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పరాజయం పాలైంది.
దీంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు అవిరయ్యాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బంగ్లా గెలిచుంటే.. అప్పుడు మూడు జట్లకు సెమీస్ అవకాశాలు ఉండేవి. కానీ బంగ్లా ఓటమి పాలవ్వడంతో మరో మ్యాచ్ మిగిలూండగానే పాక్ ఇంటిముఖం పట్టింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భావించింది.
కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో అన్ని విభాగాల్లో విఫలమై ఘోర ఓటములను మూట కట్టుకుంది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పాక్ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టడానికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.
బ్యాటింగ్‌లో ఫెయిల్..
పాకిస్తాన్ ఓటములకు ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమనే చెప్పుకోవాలి. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బాబర్ ఆజం తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ 64 పరుగులు చేసినప్పటికి.. ఛేజింగ్‌లో స్లో ఇన్నింగ్స్ ఆడి విమర్శల మూటకట్టుకున్నాడు. ఏ జట్టుకైనా ఓపెనింగ్ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం.
కానీ పాకిస్తాన్‌కు మాత్రం మొదటి రెండు మ్యాచ్‌ల్లో కనీసం 50 పరుగుల భాగస్వామ్యం కూడా రాలేదు. అంతకు తోడు రెగ్యూలర్ ఓపెనర్ ఫఖార్ జమాన్, సైమ్ అయూబ్ గాయాల పాలవ్వడం కూడా పాక్ విజయవకాశాలను దెబ్బతీశాయి. మిడిలార్డర్‌లో సైతం పాకిస్తాన్ బలహీనంగా కన్పించింది.
ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్... ఈ టోర్నీలో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసిన రిజ్వాన్.. భారత్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు సాధించాడు. అదేవిధంగా తయ్యబ్ తాహిర్‌ను జట్టులోకి ఎందుకు తీసుకున్నారో ఆర్ధం కావడం లేదు.
తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే అతడు పరిమితమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో విఫలమైనప్పటికి అతడిని భారత్‌తో మ్యాచ్‌కు కూడా కొనసాగించారు. అక్కడ కూడా అతడు అదే తీరును కనబరిచాడు. ప్రస్తుత పాక్ జట్టులో హిట్టింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఒక్కరు కూడా కన్పించడం లేదు.
బౌలింగ్‌లో కూడా..
పాకిస్తాన్ క్రికెట్ ఫాస్ట్ బౌలింగ్‌కు పెట్టింది పేరు. పాకిస్తాన్‌కు ప్రధాన బలం పేస్ బౌలింగ్. ప్రతీ మ్యాచ్‌లోనూ వారు స్పిన్నర్ల కంటే పేసర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. గత కొంత కాలంగా షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రవూప్ పేస్ త్రయం పాక్‌కు ఎన్నో అద్బుత విజయాలను అందించింది.
కానీ ఈ సారి మాత్రం ఈ పేస్ త్రయం చేతులేత్తేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు తమ సత్తాచాటలేకపోయారు. తమ పేలవ బౌలింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వీళ్లతో పోలిస్తే స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ ఎంతో బెటర్. రెండు వికెట్లే తీసినప్పటికి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
ఫీల్డింగ్ వైఫల్యం..
పాకిస్తాన్ ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యం మరో కారణంగా చెప్పవచ్చు. అప్పటికి, ఇప్పటికీ పాకిస్తాన్ ఫీల్డింగ్ మాత్రం మారలేదు. క్యాచ్‌స్ విన్ మ్యాచ్‌స్ అంటారు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఫీల్డర్లు తీవ్ర నిరాశపరిచారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్ లాథమ్ క్యాచ్ విడిచిపెట్టడంతో అతడు ఏకంగా సెంచరీ బాదేశాడు.
భారత్‌తో మ్యాచ్‌లోనూ శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌లను పాక్ ఫీల్డర్లు జారవిడిచారు. మూడు విభాగాల్లో విఫలమం కావడంతో టోర్నీ ఆరంభమైన ఆరు రోజుల్లోనే పాక్ కథ ముగిసింది. ఇక పాక్ తమ చివరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 27 రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అదేవిధంగా గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు తమ సెమీస్ బెర్త్‌లను ఖారారు చేసుకున్నాయి.
చదవండి: కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు.. అయినా అతడు ఎదుగుతున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment