మలాలా కేసులో దోషుల విడుదల
లండన్: ప్రపంచ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌పై హత్యాయత్నం కేసులో 10 మంది తాలిబన్లకు పాతికేళ్ల పాటు జైలు శిక్ష విధించామని పాకిస్తాన్ ప్రకటిస్తే అది నిజమని ప్రపంచం నమ్ముతూ వస్తోంది. వాస్తవానికి రహస్యంగా జరిగిన ఈ కేసు విచారణలో 8 మంది తాలిబన్లను నిర్దోషులుగా పేర్కొంటూ గుట్టుచప్పుడు కాకుండా వారిని విడుదల చేసిందని పాకిస్తాన్ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ బ్రిటన్‌కు చెందిన ‘డెయిలీ మిర్రర్’ పత్రిక శుక్రవారం వెల్లడించింది. మలాలా కేసులో పాకిస్తాన్ అంతర్జాతీయ ఒత్తిళ్లకు తట్టుకోలేక ఝరుల్లా, ఇస్రార్ ఉర్ రెహమాన్ అనే ఇద్దరు తాలిబన్లకు మాత్రమే శిక్షలు విధించిందని, మిగతా ఎనిమిది మందిని విడుదల చేసిందని స్వాత్ వ్యాలీ పోలీసు చీఫ్ ఆజాద్ ఖాన్ స్వయంగా వెల్లడించినట్టు, ఈ విషయాన్ని లండన్‌లోని పాకిస్తాన్ హై కమిషన్ కూడా ధ్రువీకరించిందని డెయిలీ మిర్రర్ తెలిపింది. నేరస్తుల విచారణ కూడా సరిగ్గా జరగలేదని, ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జీ, నిందితులు, ఒకరిద్దరు సైనికాధికారులు మాత్రమే విచారణలో పాల్గొన్నారని, ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా హాజరుకాలేదని ఆ పత్రిక పేర్కొంది.
అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్ల మేరకు మలాలా కేసులో తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన పదిమంది నిందితులను అరెస్టు చేశామని పాకిస్తాన్ సెప్టెంబర్ నెలలో ప్రకటించింది. వారంతా దోషులని తేలడంతో పది మందికి పాతికేళ్లపాటు జైలు శిక్ష విధించినట్టు ఏప్రిల్ నెలలో వెల్లడించింది. ఇది ఇంతకాలం నిజమేనని భారత్ సహా ప్రపంచ దేశాలు నమ్ముతూ వచ్చాయి. పాకిస్తాన్‌లో బాల బాలికలకు సమాన హక్కులు, బాలికల విద్యా హక్కుకోసం పోరాడుతున్న మలాలాపై 2012, అక్టోబర్ నెలలో తాలిబన్లు దాడిచేసి హత్యచేయడానికి ప్రయత్నించిన విషయం తెల్సిందే. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల మలాలాను బర్మింగ్ హామ్‌లోని క్వీన్ హెలిజబెత్ ఆస్పత్రికి తరలించడం, కోలుకున్న తర్వాత మలాలాకు లండన్‌లోనే ఆశ్రయం కల్పించడం తెల్సిందే.